Apsara Murder Case: అప్సర హత్యకు 15 రోజుల ముందే కుట్ర.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో విస్తుపోయే నిజాలు..

Apsara Murder Case: ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో పూడ్చిపెట్టే స్థలం మార్పు

Update: 2023-06-17 06:09 GMT

Apsara Murder Case: అప్సర హత్యకు 15 రోజుల ముందే కుట్ర.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో విస్తుపోయే నిజాలు..

Apsara Murder Case: సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. శనివారం రాత్రి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. శంషాబాద్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద హత్య చేసిన స్థలంతో పాటు, శవాన్ని పూడ్చిన స్థలానికి సాయికృ‌ష్ణను పోలీసులు తీసుకెళ్లారు.

అప్సరను హత్య చేయాలని నిందితుడు సాయికృష్ణ పక్కా ప్లాన్ చేశాడు. పథకం ప్రకారమే ట్రాప్ చేసి హత్య చేశాడు. హత్య ఎల చేయాలి..? శవాన్ని ఎక్కడ పూడ్చాలి..? సాక్ష్యాలు దొరకకుండా ఏమేం చేయాలనే విషయాలపై ముందే ప్లాన్ చేసుకున్నాడు సాయికృష్ణ. 15 రోజుల ముందే మర్డర్ స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగా తన ప్లాన్ అమలు చేసి.. అప్సరను అంతమొందించాడు.

తను పూజారిగా పనిచేస్తున్న బంగారు మైసమ్మ ఆలయం వెనుక ఆస్పత్రి దగ్గర శవాన్ని పూడ్చేందుకు ప్లాన్ చేశాడు సాయికృష్ణ. ఏకంగా 20 అడుగుల గుంత కూడా తీయించాడు. అది గమనించిన ఆస్పత్రి సిబ్బంది సాయికృష్ణను అడ్డుకోవడంతో.. వెంటనే ఆ గుంతను పూడ్చివేశాడు. తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో పాతిపెట్టే స్థలాన్ని మార్చేశాడు. పథకం ప్రకారం ట్రాప్ చేసి శంషాబాద్‌లో అప్సరను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తను పనిచేస్తున్న ఆలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఆలయానికి సమీపంలో ఉన్న ఎమ్మార్వో కార్యాలయం దగ్గర మ్యాన్‌హోల్‌ పక్కనే స్థలం ఉండటంతో అక్కడ గుంత తీసి అప్సర మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.

హత్య చేసి పాతిపెట్టిన సాయికృష్ణ ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్లాన్ చేశాడు. పూడ్చిపెట్టిన స్థలంలో రెండు టిప్పర్లతో మట్టి పోయించాడు. ఆ తర్వాత దాని మీద కాంక్రీట్ వేసి పూర్తిగా మూయించేశాడు. సాయికృష్ణ తెలిపిన వివరాలతో టిప్పర్ యజమానిని, కూలీని పిలిపించారు పోలీసులు. వారిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇక ఇవాళ్టితో సాయికృష్ణ కస్టడీ ముగియనుండటంతో తాము సేకరించిన హత్య వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు పోలీసులు.

Tags:    

Similar News