Bathukamma Sarees : బతుకమ్మ చీరలు బంద్.. మహిళలకు పండగ కానుకగా రూ. 500..రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
Bathukamma Sarees : తెలంగాణ సర్కార్ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. బతుకమ్మ పండగ సందర్భంగా ఈసారి మహిళలకు చీరలకు బదులుగా కొత్త కానుక ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోందట.
Bathukamma Sarees : తెలంగాణలో బతుకమ్మ పండగ సందడి షురూ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి బతుకమ్మ పండగకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. ఈ చీరల పట్ల కొంతమంది మహిళలు హర్షం వ్యక్తం చేస్తే..కొంతమంది నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. అయితే ఈ సారి బతుకమ్మ పండగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా రూ. 500 ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఫ్రీ బస్సు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రూ. 2500 మహిళల ఖాతాల్లో జమ చేయడం వంటివాటిపై కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తోంది.
అయితే మరో పది రోజుల్లో బతుకమ్మ పండగ మొదలుకానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 500 నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రూ. 500 లేదంటే ఆపైనా అందించేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.
ఇక ఈ నగదును కూడా మహిళల ఖాతాల్లో జమ చేయడానికి రేషన్ కార్డును ప్రాతిపాదికన తీసుకునే విధంగా ప్లాన్ చేస్తోంది. వారి చేతికి ఇవ్వాల అని కూడా పరిశీలన చేస్తోందని సమాచారం. డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈ కానుక అందించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ విషయంపై మరో మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందట. ఇప్పటికే చేనేత వారికి కూడా చీరలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఇది చేనేతకు ఉపాధిని కూడా అందిస్తోంది. ఒకవేళ చీరలకు బదులుగా నగదు ఇచ్చినట్లయితే చేనేత కార్మికల ఉపాధికి అడ్డుగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.