KTR: జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దమే
KTR: తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
KTR: తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే తాను సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు.జైల్లో హ్యాపీగా యోగా చేసుకొని బయటకు వస్తానన్నారు. ఆ తర్వాత పాదయాత్రకు సిద్దమవుతానని ఆయన తెలిపారు. తనను లక్ష్యం చేసుకోవద్దు.... ప్రజా సమస్యలను టార్గెట్ చేయాలని ఆయన హితవు పలికారు. ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన స్పష్టం చేశారు.రేవంత్ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ వెనుక బీఆర్ఎస్ ను అంతం చేయాలనే లక్ష్యమే కనిపిస్తోందని ఆయన చెప్పారు.
ఫార్మూలా ఈ రేసింగ్ కోసం రూ.35-40 కోట్లు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన తెలిపారు.2003లోనే ఫార్మూలా ఈ రేసింగ్ నిర్వహించేందుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తాను ఫార్మూలా ఈ రేసింగ్ నిర్వహణ కోసం మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలతో ఫార్మూలా ఈ కారు రేసింగ్ నిర్వహించినట్టు ఆయన వివరించారు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసేందుకే ఈ రేసింగ్ నిర్వహించామన్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ నిర్వహణ కోసం ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు చేయడం సాధారణ విషయమేనన్నారు.
విచారణకు సిద్దం
హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు తనపై కేసులు పెడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా అని అన్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి... కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రూ.50 లక్షల బ్యాగుతో దొరికిన బ్యాగ్ మ్యాన్ కు శిక్షపడాలని ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. రేసు రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డితో, సంబంధిత శాఖలపై కేసులు పెట్టాలని కేటీఆర్ కోరారు. తాము బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి బ్యాడ్ ఇమేజ్ తెస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫార్మూలా రేసింగ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానన్నారు.మేఘా కృష్ణారెడ్డి ఇంటిపైకి ఏసీబీని పంపే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. సుంకిశాల ఘటనలో అవినితీ కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డిపైనే పెట్టాలన్నారు.