Harsha Sai Case: యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు... కూల్ డ్రింక్‌లో మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడా?

Harsha Sai Case: పేదలకు సహాయం చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యాడు హర్షసాయి. 2018లో ‘ఫర్ యూ తెలుగు’ పేరుతో యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించారు. ఆరేళ్ల కాలంలోనే ఆయన యూట్యూబ్ కు 10.9 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లకు చేరింది.

Update: 2024-09-26 13:27 GMT

యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు... కూల్ డ్రింక్‌లో మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడా?

Harsha Sai Case: పాపులర్ యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ ఫేమ్ యువతి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆయనపై 329, 376, 354 సెక్షన్ల కింద సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. ఆమె తన వద్ద నుంచి డబ్బులు లాగడానికే ఫిర్యాదు చేశారని హర్షసాయి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగి పోలీసులు సెప్టెంబర్ 26న స్టేట్ మెంట్ తీసుకున్నారు.

కూల్ డ్రింకులో మత్తు ఇచ్చి...

బిగ్ బాస్ ఓటీటీలో ఫైనల్ వరకు వెళ్లిన ఓ యువతికి హర్షసాయికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ‘మెగా’ సినిమా తీశారు. ఈ సినిమాలో హీరోయిన్ , నిర్మాత కూడా బాధితురాలే. హీరోగా హర్షసాయి నటించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ చర్చలకు పిలిచిన సమయంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు.

మెగా సినిమాకు సంబంధించిన రైట్స్ ఇవ్వకపోతే తన న్యూడ్ వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు దిగుతున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె గురువారం పోలీసులకు అందించారు.

బైట్: బాధితురాలు

ఎవరీ హర్ష సాయి?

పేదలకు సహాయం చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యాడు హర్షసాయి. 2018లో ‘ఫర్ యూ తెలుగు’ పేరుతో యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించారు. ఆరేళ్ల కాలంలోనే ఆయన యూట్యూబ్ కు 10.9 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లకు చేరింది. విశాఖపట్టణానికి చెందిన హర్ష.. గీతం యూనివర్శిటీలో బీటెక్ చదువుకునే రోజుల్లోనే ఈ చానెల్ స్టార్ట్ చేశారు.

ఓ కుటుంబానికి సహాయం చేసేందుకు డెయిరీ ఫారం, ఏనాడూ స్టార్ హోటల్ మెట్లెక్కని సామాన్యులకు ఫలక్ నుమా ప్యాలెస్ లో భోజనం పెట్టించడం వంటి వీడియోలతో యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసి టాప్ యూట్యూబర్ అయ్యాడు. ఆయన పోస్టు చేసిన వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ గా మారుతుంది.

సహాయం చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఏంటని ఆయనను ప్రశ్నించేవారున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేశారని ఆయనపై కొందరు ఆరోపణలు చేశారు. కానీ, ఈ ఆరోపణలు ఆయన పట్టించుకోలేదు. తాను అనుకున్నదే చేస్తారు.

నార్సింగి పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు కాగానే ఆయన జంపయ్యారు. నా గురించి మీకు తెలుసు... అన్ని విషయాలను తన న్యాయవాది చెబుతారని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన క్లయింట్ పై యువతి తప్పుడు ఆరోపణలు చేశారని హర్షసాయి న్యాయవాది చిరంజీవి చెప్పారు.

బైట్: చిరంజీవి (హర్షసాయి న్యాయవాది)

హర్షసాయి కోసం గాలింపు

ఈ కేసు నమోదైన తర్వాత హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హర్షసాయిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

బైట్: రామకృష్ణారెడ్డి (నార్సింగి సీఐ)

మెగా సినిమాతోనే వివాదమా?

మెగా సినిమాకు సంబంధించిన వివాదమే కేసు వరకు వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. ఈ సినిమా టీజర్ ఏడాది క్రితమే విడుదలైంది. కానీ, ఇంతవరకు సినిమా విడుదల కాలేదు. ఈ సినిమాకు తానే బడ్జెట్ చేశానని బాధితురాలు చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని హర్షసాయి వర్గం వాదిస్తోంది.

కలకలం రేపిన ఆడియో సంభాషణ

నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత బాధితురాలు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను హర్షసాయి బృందం మీడియాకు లీక్ చేసింది. అయితే, వాట్సాప్ కాల్ లో యువతి మాట్లాడుతున్న సమయంలో మరో ఫోన్ లో ఈ ఆడియో సంభాషణను రికార్డ్ చేసినట్టు చూపించే వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హర్షసాయి ఇలా చేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

అయితే, ఇప్పుడు హర్షసాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News