ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, బట్టల వ్యాపారి చేసిన పనికి నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
POCSO Case: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, బట్టల వ్యాపారి చేసిన పనికి నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
How a 26 years old young man helped minor girl in fighting rape case: అది 2023 జూన్ నెల. నల్లకుంటలో బట్టల వ్యాపారం చేసుకునే 26 ఏళ్ల యువకుడు రోజులాగే వచ్చి బట్టల షాప్ తెరిచి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అంతలోనే ఉన్నట్లుండి ఒక చిన్నారి బిగ్గరగా వేసిన కేక ఆ యువకుడి చెవిలో పడింది. వెంటనే ఆ కేక వినిపించిన వైపు పరుగెత్తారు. అక్కడ తను చూసిన దృశ్యం ఆయన ఒళ్లు జలదరించేలా చేసింది.
ఆరేళ్ల వయస్సుండే చిన్నారి తలకు గాయాలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆ చిన్నారి ఊపిరి తీసేందుకు ఒక వ్యక్తి ఆమె గొంతుపై అదేపనిగా కాలు పెట్టి ఒత్తుతున్నాడు. ఆ బాధ తట్టుకోలేక ఆ చిన్నారి పెట్టిన గావుకేకే తన చెవిలో పడింది. ఆ యువకుడితోపాటే మరో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఆ ముగ్గురుని చూసి చిన్నారిపై దాడి చేస్తున్న వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు.
ఆ చిన్నారిని అలా చూసి చలించిపోయిన ఆ యువకుడు వెంటనే పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఆ యువకుడి సమయస్పూర్తి వల్ల ఆ చిన్నారి బతికి బట్టకట్టింది.
ఫుడ్ ఇప్పిస్తానని కాచిగూడ నుండి నల్లకుంటకు..
ఆ బాలికపై దాడికి పాల్పడిన నిందితుడు చెత్త ఏరుకునే వ్యక్తి. కాచిగూడలో ఒంటరిగా తిరుగుతున్న బాలికను తినడానికి ఏదైనా ఇప్పిస్తానని ఆశపెట్టి అక్కడి నుండి నల్లకుంట వరకు తీసుకొచ్చాడు. అక్కడే బీరు బాటిల్‌తో బాలికపై ఘోరమైన అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి బతికి ఉంటే తనకు సమస్య అని చెప్పి ఆమెపై దాడి చేసి చంపేసేందుకు యత్నించాడు. కానీ ఆ సమయంలోనే ఈ యువకుడు రావడంతో అక్కడి నుండి పరారయ్యాడు.
ఆ బాలికను రక్షించిన యువకుడు అంతటితో తన పని అయిపోయిందని భావించలేదు. ఆ చిన్నారి బాధను కళ్లారా చూసిన వ్యక్తిగా ఆమె తరుపున న్యాయపోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ న్యాయ పోరాటం తమ వల్ల కాదని చిన్నారి తల్లిదండ్రులు పక్కకు తప్పుకున్నారు. కానీ ఆ యువకుడు వదల్లేదు. తనే బాలిక తరపున పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం మొదలుపెట్టారు.
మైనర్లపై లైంగిక వేధింపులను నివారించే పోక్సో చట్టం కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుపై విచారణ చేపట్టింది. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. బాలికతో పాటు ఆ యువకుడు కూడా నిందితుడిని గుర్తుపట్టడమే కాకుండా చివరివరకు పోరాడారు.
ఆ బట్టల వ్యాపారి తనతో పాటే ఘటన స్థలంలో బాలికను రక్షించడానికి వచ్చిన మరో ఇద్దరి సహాయంతో కోర్టుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలను ఇచ్చారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నిందితుడు అన్నిరకాలుగా ప్రయత్నించాడు. కానీ అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు, నిందితుడిని దోషిగా గుర్తించింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సాక్ష్యుల వాంగ్మూలం వంటివి ఈ కేసు తీర్పు వెల్లడించేందుకు ఆధారాలుగా నిలిచాయి. నాంపల్లి స్పెషల్ కోర్టు నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 7లక్షల పరిహారం ప్రకటించింది.
కేసు విచారణను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఆ యువకుడిని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ యువకుడి సహకారం వల్లే నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగాం అని అన్నారు. అలాంటి దోషి సమాజంలో ఉంటే, ఇంకెన్ని దారుణాలు జరిగేవో.. కానీ ఆ యువకుడి పోరాటం తప్పు చేసిన వ్యక్తికి 25 ఏళ్ల శిక్షపడేలా చేసింది. ఆ సైకో బారిన మరొకరు పడకుండా సమాజాన్ని రక్షించింది. ఇది కదా పోరాట స్పూర్తి అంటే... ఇది కదా హీరోయిజం అంటే... నేరాలు, ఘోరాలు జరిగిన చోట సెల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసుకుని తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయే వారున్న చోటే ఇలాంటి వారు కూడా ఉన్నారు.