Weather update: తెలంగాణలో విచిత్ర వాతావరణం.. ఎండలతోపాటు వర్షాలూ పడతాయన్న ఐఎండీ

Weather update: తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా 48గంటల వ్యవధిలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బీహార్ నుంచి ఝార్ఖండ్ , ఛత్తీస్ గడ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సోమవారం నిజామాబాద్ లో సాధారణం కంటే 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 2.1 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 42.3 డిగ్రీలుగా నమోదు అయ్యింది.