Gang Rape: దారుణం.. 12ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. మాయమాటలతో అడవిలోకి తీసుకెళ్లిన మహిళ

Gang Rape: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. మాయమాటలు చెప్పి ఓ మహిళ అడవిలోకి తీసుకెళ్లింది. అనంతరం ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు యువకులు, మహిళలను అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన 35ఏళ్ల వివాహిత పథకం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువు ఇద్దరు యువకులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. అనంతరం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రికి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించారు. తర్వాత బాలికను వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకలతో పాటు మహిళ, ఆమె బంధువుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.