ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగలు.. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు

Jeevan Reddy: గతంలో ఇచ్చిన హామీలపై జీవన్ రెడ్డిని నిలదీస్తున్న ప్రజలు

Update: 2023-11-07 10:38 GMT

Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగలు.. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు

Jeevan Reddy: ఆయన ప్రచారానికి వస్తున్నారంటే.. గో బ్యాక్ అంటూ నినాదాలు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న గ్రామస్థులు. ఏం చేశారని ఓట్లు వేయాలంటూ ప్రశ్నల వర్షం. ఇవి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోని సీన్స్. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న జీవన్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు షాకుల మీద షాకులిస్తున్నారు. అడుగడుగునా ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి తమ గ్రామాన్ని పట్టించుకోనప్పుడు.. ఓట్లు అడగడానికి ఎలా వస్తారంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో జీవన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న స్థానికులు తమ గ్రామంలో ప్రచారం నిర్వహించొద్దని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి మహిళలు, యువకులు.. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకుంటున్నారు. జీవన్ రెడ్డికి సంబంధించిన ప్రచార వాహనాలు తమ గ్రామాల్లో రావద్దని ఆందోళనకు దిగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా తమ గ్రామానికి ఏమిచ్చావాని నిలదీస్తున్నారు స్థానికులు.

ఇటీవల కొత్తగా ఏర్పడ్డ డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామస్థులు జీవన్ రెడ్డి ప్రచార రథాన్ని అడ్డుకుని షాకిచ్చారు. ఇప్పుడు తాజాగా నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. గ్రామస్థులు నిన్న జీవన్ రెడ్డి ప్రచార రథాన్ని అడ్డుకుని.. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావద్దంటు ప్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. లక్కంపల్లి సెజ్ లో నాలుగు వందల ముప్పైరెండు ఎకరాల భూమిని.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే, తిరిగి ఇప్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసనకు దిగారు. తమ ఊరిలో దళితులు లేరా..? దళితబందు ఎందుకు ఇవ్వలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రుణమాఫీ, ఉచిత ఎరువులు ఎక్కడ అంటూ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని మాయమాటలు చెప్పి.. మోసం చేశారంటూ నిలదీస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ..? బీసీ బంధు, గృహాలక్ష్మి ఎవరికిప్పించావని ప్రశ్నిస్తున్నారు.

జీవన్ రెడ్డి.. నీవ్యు చేస్తోంది ప్రజాస్వామ్య రాజకీయమా.. లేక టిప్పర్ల రాజకీయమా అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేసి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల ప్రజలు. మొన్నటికీ మొన్న ఆర్మూర్ మండలం పతేపూర్ గ్రామస్థులు జీవన్ రెడ్డిని అడ్డుకుని సమస్యలపై నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుండి వెనుదిరిగారు. గత వారం రోజుల క్రితం నందిపేట్ మండలం తల్వెద గ్రామంలో ఓ యువకుడు ఎమ్మెల్యే తమ గ్రామానికి రావద్దంటు ప్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. పథకాలు ప్రజల కోసమా.. నీ అనుచరులకోసమా.. అంటూ పలు గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థుల విమర్శలు, ఆరోపణల కన్నా.. సొంత నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతే జీవన్ రెడ్డికి పెద్ద సమస్యగా మారింది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. జీవన్ రెడ్డికి కనీసం ప్రచారం కూడా నిర్వహించుకోలేని పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News