ఆరోగ్యాన్ని పంచే.. వినూత్న అనుభూతిని కలిగించే మరో పార్కు ''పంచతత్వ''
ఆరోగ్యాన్ని పంచే.. వినూత్న అనుభూతిని కలిగించే మరో పార్కు గ్రేటర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రోజు వారీ ఉదయపు నడకకు భిన్నంగా ప్రత్యేక థీమ్‌లతో పార్కుల్లో సరికొత్త వసతులు ఇక్కడ ఉన్నాయి.
ఆరోగ్యాన్ని పంచే.. వినూత్న అనుభూతిని కలిగించే మరో పార్కు గ్రేటర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రోజు వారీ ఉదయపు నడకకు భిన్నంగా ప్రత్యేక థీమ్‌లతో పార్కుల్లో సరికొత్త వసతులు ఇక్కడ ఉన్నాయి. తక్కువ దూరంనడిస్తేనే....ఎక్కువగా వాకింగ్ చేసిన అనుభూతితోపాటు.. సుగంధ ద్రవ్యాల వాసనతో ఆరోగ్యం మరింత కుదుటపడే అవకాశం ఉండాలని బల్దియా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా వనస్థలిపురంలో వినియోగంలో ఉన్న పార్కు తరహాలో ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును అభివృద్ధి చేసింది. మంత్రి కెటిఆర్ ప్రారంభించిన ఈ పంచతత్వ పార్కు పై ఓ స్టోరి..
గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో పంచతత్వ పార్కు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఇందిరా పార్కులోని ఎకరం స్థలంలో ఈ పార్కును తీర్చిదిద్దారు. అన్ని సాధరణ పార్కుల్లా కాకుండా... నూతన విధానంలో పార్కును అభివృద్ధి చేశారు. వృత్తాకారంలో ఉండే పంచతత్వ పార్క్ వాక్‌వేలో తొమ్మిది బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఓ బ్లాక్‌లో 20 ఎంఎం, మరో బ్లాక్‌లో 10 ఎంఎం పరిమాణంతో కంకర రాళ్లు, ఇలా ఒక్కో బ్లాక్‌లో నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక రేణువులు, చెక్కపొట్టు, గులకరాళ్లు ఒక్కో బ్లాక్‌లు పోసి పాత్ వే ఏర్పాటు చేశారు. పాత్ వేలో చెప్పులు, షూస్ లేకుండా నడవడం వల్ల అరికాళ్లలో కలిగే ఒత్తిడి మెదడుకు చేరి మానసిక, ఆరోగ్య ప్రయోజనాని కి ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
పంచావతారాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నిల సమాహారమే ఆక్యుప్రెషర్ థీమ్. పార్కులో ఓ చెట్టు చుట్టూ గడ్డి, ఇసుక, కంకర, చెక్క
పొట్టు, నీరు, బురదలతో ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. చెప్పులు లేకుండా ఈ ట్రాక్‌లో నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు. పలు అధ్యయనాల నివేదిక ప్రకారం... సాధారణంగా వాకింగ్ చేసే వారితో పోలిస్తే కొబుల్ స్టోన్స్‌పై నడిచే వృద్ధుల్లో బీపీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పాదాలకు ఆచ్ఛాదన లేకుండా నడవడంతో శరీరంలోని అన్ని భాగాలూ భాగా పని చేస్తాయంటున్నారు. ఈ వ్యాయామంతో శారీరకంగానే కాకుండా.. మానసిక దృఢత్వమూ పెరుగుతుందని చెబుతున్నారు.
ఇందులో నడిస్తే పాదాల్లో ఉండే నాడులు ఉత్తేజం పొంది రక్త ప్రసరణ జరిగి ఎక్కువ దూరం నడిచిన లాభం కలగనుంది. ఇక్కడ నవగ్రహాల మొక్కలు కూడా ఏర్పాటు చేశారు. ఇంపుగా ఉండేందుకుగా నీటి శబ్దంతో పాటు...గౌతమ బుద్దుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాశులకు సంబంధించిన మొక్కలతో పాటు... 45 జౌషధ మొక్కలు కూడా నాటారు.