గల్ఫ్ లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా వాసి

కూతురు పెళ్లి కోసం నాలుగు రాళ‌్లు సంపాదించాలనుకున్నాడు. వైభవంగా పెళ్లి చేసి కన్న బిడ్డను అత్తగారింటికి పంపాలనుకున్నాడు. కానీ అతని ఆశలు ఆవిరయ్యాయి

Update: 2020-12-23 05:11 GMT
ప్రతీకాత్మక చిత్రం 

కూతురు పెళ్లి కోసం నాలుగు రాళ‌్లు సంపాదించాలనుకున్నాడు. వైభవంగా పెళ్లి చేసి కన్న బిడ్డను అత్తగారింటికి పంపాలనుకున్నాడు. కానీ అతని ఆశలు ఆవిరయ్యాయి. తలదాచుకోవడానికి కూడా గూడు లేక.. తినడానికి తిండి లేక.. ఏజెంట్ మోసానికి బలై.. ఉపాధి లేక అల్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఎవరి కంటా పడకుండా దొంగచాటుగా జీవిస్తున్నాడు. ఇదీ బహ్రెయిన్‌లో ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బాధితుడి పరిస్థితి.

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం నల్లగుట్ట తండాకు చెందిన బుక్యా దేవ్‌జీ 14 నెలల క్రితం బహ్రెయిన్‌లో అడుగుపెట్టాడు. ఏజెంట్ చెప్పినట్లుగా మంచి పని దొరుకుతుందని ఓ కంపెనీలో చేరాడు. కానీ అక్కడ అంతా తారుమారైంది. ఏజెంట్ చెప్పిన పని లేకపోగా.. యజమాని జీతం కూడా సరిగా ఇవ్వలేదు. దాంతో పని మానేసి బయటకొచ్చాడు. కానీ సదరు కంపెనీ అతనికి పాస్ పోర్టు ఇవ్వలేదు. దీంతో అక్కడ నుంచి ఏ పనీ దొరకలేదు. తిండి లేక నరక యాతనపడుతున్నాడు. అక్కడి తన పరిస్థితులను సెల్ఫీ వీడియోతో వివరించిన బాధితుడు.. ఈనెల 28న తన కూతురు వివాహానికి హాజరవ్వాలని.. ఎలాగైనా తనను సొంతూరుకు రప్పించాలని వేడుకుంటున్నాడు.

తనను స్వదేశానికి రప్పించాలని తెలంగాణ గల్ఫ్‌ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డిని వేడుకుంటూ బాధితుడు పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు కుటుంబసభ్యులు కూడా తెలంగాణ సర్కారు స్పందించి.. బుక్యా దేవుజీని రప్పించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News