Telangana: తర్వలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు
Telangana: ఏ క్షణంలోనైనా తేదీ వెలువడే చాన్స్ * తిరుపతి లోక్‌సభ స్థానానికి కూడా
Telangana: నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ స్థానాలు, 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటిలో కన్యాకుమారి, మలప్పురం లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుందని ప్రకటించింది. మిగిలిన స్థానాలకు ఏ క్షణంలోనైనా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానానికి కూడా ఉపఎన్నికలు ఈ సందర్భంగానే జరుగుతాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నగార్జున సాగర్ స్థానం ఖాళీ అయ్యింది. ఇక్కడ జరిగే ఉపఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ పోటీకి నిలవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సాగర్ ఉపపోరుపై ఆసక్తి నెలకొంది.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతితో తిరుపతి లోక్ సభ స్థానం ఖాళీ అయ్యింది. త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్న ఉపఎన్నిలతో పాటే తిరుపతి బై ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని మిగిలిన ప్రాధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ మద్దతుతో జనసేన తన అభ్యర్థిని ఇక్కడ బరిలో దింపాలని చూస్తోంది. అయితే, బీజేపీ తిరుపతిలో తాము పోటీ చేస్తుందా.. లేక, జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వనుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ మాత్రం ఇప్పటికే పోటీకి సిద్ధమైంది. ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీకి సంబంధించి రాజస్థాన్‌లో 3, కర్ణాటకలో 3, తెలంగాణ, ఒడిసా, మధ్యప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మిజోరం, మహారాష్ట్ర, హరియాణా, మేఘాలయ, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకు ఉప ఎన్నిక జరగనుంది.