Telangana Thalli statue: కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్... అందరి సందేహం ఒక్కటే!
Ponnam Prabhakar meets KCR: తెలంగాణ రాజకీయాల్లో నేడు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎల్లుండి డిసెంబర్ 9 నాడు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్లి ప్రభుత్వం తరపున కేసీఆర్‌ను ఆహ్వానించారు.
మరోవైపు తెలంగాణ గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను, రూపు రేఖలను రేవంత్ రెడ్డి సర్కారు మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అందుకే విగ్రహంలో మార్పులు చేసినట్లు ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.
అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకోవడం కోసమే పేర్లు, విగ్రహాలు మార్చుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆహ్వానాన్ని కేసీఆర్ పరిగణనలోకి తీసుకుంటారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ హాజరైతే, తెలంగాణ తల్లి విగ్రహం మార్పును పరోక్షంగా వారు సమర్థించినట్లే అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.