KTR: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
KTR: ఆత్మనిర్భర్ ప్యాకేజి వల్ల ఒరిగిందేంటని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.
KTR: హుజూరాబాద్ ఉప ఎన్నిక వాతావరణంలో... టీఆర్ఎస్ మళ్లీ తనదైన వ్యూహాన్ని మొదలెట్టింది. బిజెపి వైఫల్యాలను తెర మీదకు తెచ్చేందుకు గులాబీ సైన్యాధిపతి కేటీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. గతంలో బిజెపి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరిన కేటీఆర్.. ఈసారి డీటెయిల్డ్ గా అటాకింగ్ గేమ్ మొదలెట్టారు. ఆత్మనిర్భర్ ప్యాకేజి గురించి ఆర్భాటంగా చెప్పుకుంటున్నారని.. దాని వల్ల ఒరిగిందేంటని సూటిగా కేంద్రాన్ని నిలదీశారు కేటీఆర్. నేరుగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కే లేఖాస్త్రం ప్రయోగించారు.
కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నా.. ఇంతవరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరలేదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా ఎంఎస్ఎంఈలు లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని.. 25 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగిందన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన గ్యారంటేడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకం మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. ఈ పథకంలో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భావిస్తున్నట్లు తెలిపారు. పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించడం జరిగింది. దీంతో ఎంఎస్ఎంఈలు అనేక వ్యవప్రయాసలకు గురవుతున్నాయి.. ఒక్కో యూనిట్ ఒక్కో విదమైన ఇబ్బందిని, సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని ఎంఎస్ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా వాటి అవసరాలు తీరే అవకాశం లేదన్నారు.
దీంతో పాటు ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన పిఎల్ఐ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్ఎంఈల పై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది. కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకుంటుందని, కేంద్రం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేస్తున్నట్లు.. ఈ ప్యాకేజీ విషయంలో తమ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.