Telangana MBBS Counselling 2024: తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ..ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు
Telangana MBBS Counselling 2024: నీట్ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్త ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మెరిట్ జాబితాను రిలీజ్ చేసింది. గురువారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ తెలిపింది.
Telangana MBBS Counselling 2024: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఎంట్రెన్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. సెప్టెంబర్ 26 గురువారం నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. కన్వీనర్ కోటాలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థులు మెరిట్ జాబితాను ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం రిలీజ్ చేసింది.
కాగా మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బుధవారం సాయంత్రం ఐదుగంటల్లోపు యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా తెలియజేయాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బి. కరుణాకర్ రెడ్డి తెలిపారు. మెరిట్ ఆర్డర్ పై అభ్యంతరాల పరిశీలన తర్వాత గురువారం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.
మరోవైపు తుది జాబితా విడుదలతోపాటు గురువారం సెప్టెంబర్ 26 నుంచి నీట్ ర్యాంకర్లకు కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు విద్యార్థులు అన్ని సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. గతేడాది వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు వివరాలు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వారీగా వర్సిటీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై వివాదం తలెత్తడంతో ఈ ఏడాది కౌన్సిలింగ్ ప్రక్రియలో జాప్యం జరిగింది. కోర్టు వివాదాలతో కౌన్సెలింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్ కు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణ చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించే విధంగా జారీచేసిన చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీం గత శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించడంతోపాటు కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్ధులకు కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోనికి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయశాఖ సమీక్ష, సూచనల తర్వాత రాష్ట్ర సర్కార్ కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. స్థానికతపై కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా రిలీజ్ చేసింది.
తెలంగాణలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 15శాతం ఆలిండియా కోటాలో భర్తీ కానున్నాయి. మిగిలిన సీట్లు రాష్ట్ర విద్యార్థులకు కౌన్సెలింగ్ లో అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి ప్రవేశాల నిబంధన గడువు ముగియడంతో మిగిలిన సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.