Mallanna Sagar Project: హరీష్ రావు ఇక్కడికి రావాలి.. ఫ్లెక్సీ తగలబెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు
Mallanna sagar project News: సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు రోడ్డెక్కారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు అబద్దాలు చెప్పి తమ భూములు తీసుకున్నారని పల్లెపహడ్ గ్రామస్తులు అన్నారు. ఇక్కడి వాళ్లంతా తమ వాళ్లేనని, వారికి ఏ అన్యాయం జరగకుండా చూసుకుంటానని మాటిచ్చిన హరీష్ రావు తమ వద్దకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన రైతులు, గ్రామస్తులు అంతా ఇప్పటికీ న్యాయం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు ఫ్లెక్సీ తగలబెట్టి తమ నిరసన వ్యక్తంచేశారు.
హరీష్ రావుపై సంచలన ఆరోపణలు
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇక్కడి గ్రామాల సర్పంచ్ లు, బ్రోకర్లు, ఇక్కడ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారితోనే మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నారన్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా భూములు తీసుకుని, నష్టపరిహారం విషయంలో పట్టించుకోలేదన్నారు. దాంతో భూములు కోల్పోయిన ఒంటరి మహిళలు, ఏ ఆధారం లేని వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాటల్లో చెప్పలేమని పల్లెపహడ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
హరీష్ రావు ఎక్కడో ఉండి రహస్యంగా ప్రెస్ మీట్ పెట్టి తన పరపతి పెంచుకోవాలని చూస్తున్నారని గ్రామస్తులు అన్నారు. అందుకే హరీష్ రావు ఇక్కడికి వచ్చి నేరుగా తమతో మాట్లాడాలని గ్రామస్తులు పట్టుబట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం చేసినట్లుగా మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో క్యాంప్ ఆఫీసు నుండి ప్రకటించారు. అది నిజమే అయితే ఆ కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని గ్రామస్తులు ప్రశ్నించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పునరావాసం, ఆర్థిక సహాయం పేరిట హరీష్ రావు, అధికారులు, బ్రోకర్లు జేబులు నింపుకున్నారు కానీ తమకేమీ దక్కలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తనని ఉద్దేశించి ఎవరు, ఎలాంటి విమర్శ చేసినా, ఆ విమర్శలకు స్పందించి వివరణ ఇవ్వడం హరీష్ రావుకు అలవాటు. మరి ఈ వివాదంలో ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.