Komatireddy Venkat Reddy: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక ఒకే బిల్డింగ్‌లోకి..

Update: 2024-10-23 15:54 GMT

Komatireddy Venkat Reddy about Assembly Building renovation: తెలంగాణ అసెంబ్లీలో త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఒకే భవనంలో రోజు త్వరలోనే రానుంది. ఈ మాటలు అంటుంది ఇంకెవరో కాదు.. స్వయంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పటివరకు అసెంబ్లీ ప్రాంగణం అంతా ఒక్కటే అయినప్పటికీ, లోపల శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కూర్చొనే భవనాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మరో మూడు నెలల్లో శాసన మండలి సభ్యులు సైతం అసెంబ్లీ భవనంలోనే సమావేశాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

2007 వరకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా ఒక భవనంలోనే ఉండేవారని.. ఇకపై కూడా అలాంటి పద్ధతిని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ భవనం ఒక పురాతన భవనం కనుక దాని సహజత్వం ఎక్కడా దెబ్బతినకుండా పనులు చేపడుతున్నామన్నారు. ఆగా ఖాన్ ఫౌండేషన్ తో కలిసి ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ. 49 కోట్లు వెచ్చించి చేపడుతున్న ఈ పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు మంగళవారం సమావేశమై ఈ పనులపై సమీక్ష నిర్వహించారు. రెండు వేర్వేరు భవనాల్లో కూర్చుని పనులు చేస్తుండటం వల్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పనుల మధ్య సమన్వయంలో ఇబ్బందులు ఉన్నాయని, అవి అధిగమించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

పార్లమెంట్ లో రాజ్యసభ, లోక్ సభ తరహాలోనే ఇక్కడ కూడా ఒకవైపు శాసన సభ మరోవైపు శాసన మండలి వచ్చేలా చూస్తున్నామన్నారు. రెండింటి మధ్యలో సెంట్రల్ హాల్ లో విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News