CM KCR: ఇవాళ నుంచి కేసీఆర్ రెండో విడత ప్రచారం
CM KCR: ఈరోజు దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో పర్యటన
CM KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేసి.. కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు.
ఈ నెల 28 వరకు సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా.. కాసేపట్లో దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రెండో విడతలో ప్రతిరోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేసుకున్నారు కేసీఆర్. 16 రోజుల్లోనే 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. నవంబర్ 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ లో ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో సీఎం కేసీఆర్ పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్నారు. ఇక రేపు పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం, ఎల్లుండి బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. నవంబర్ 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న చేర్యాలలో పర్యటించనున్నారు గులాబీ బాస్.
నవంబర్ 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నవంబర్ 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, నవంబర్ 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు.. గజ్వేల్ లో ప్రచార సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.