విద్యుత్ కొనుగోలు పై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్.. 12 పేజీలతో జస్టిస్ నర్సింహారెడ్డికి లేఖ
Power Purchase: ఛత్తీస్‌ఘఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు.
Power Purchase: ఛత్తీస్‌ఘఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 12 పేజీలతో కూడిన లేఖను పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డికి రాశారు కేసీఆర్. కరెంట్ కోసం తిప్పలుపడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్నిరంగాలకూ 24 గంటల నాణ్యమైన విద్యు విద్యుత్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు.
దీనిని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టమన్నారు. దానికి తోడు కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తనకు బాధ కలగించిందన్నారు మాజీ సీఎం కేసీఆర్.
‘‘విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్ ఏ మాత్రం సరిపోదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్ ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చేసి చూపించేందుకే ప్రయత్నాలు. విలేకర్ల సమావేశంలో కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వైదొలగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా’’ అని కేసీఆర్ తెలిపారు.