Rave party at ktr's brother in law Raj Pakala Farm House: జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదికి చెందిన ఫామ్ హౌజ్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిందనే వార్త సంచలనం సృష్టించింది. ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినది అని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు సోదాలకు వెళ్లడంపై మాజీ మంత్రి కేసీఆర్ డీజీపీ జితేందర్‌కి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సెర్చ్ వారెంట్ లేకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్లి సోదాలు ఎలా నిర్వహిస్తారని కేసీఆర్ డీజీపీని ప్రశ్నించినట్లు సమాచారం. వెంటనే సోదాలు నిలిపేయాలని కేసీఆర్ కోరినట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలావుంటే, మరోవైపు రేవ్ పార్టీ ఘటన అనంతరం రాజ్ పాకాల కనిపించకపోవడంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రాయదుర్గంలోని రాజ్ పాకాలతో పాటు ఆయన సోదరుడు శైలేంద్ర ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు పోలీసులు వెళ్లారు. అక్కడికి ముందే చేరుకున్న బీఆర్ఎస్ నేతలు వివేకానంద, బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్ తదితరులు పోలీసులను అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి తమ పని తాము చేసుకుపోయారు.
రేవ్ పార్టీలో భారీగా దేశీ, విదేశీ మద్యం పట్టుబడటంతో ఎక్సైజ్ పోలీసులు కూడా సైబరాబాద్ పోలీసులతో కలిసి ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. మొత్తానికి తెలంగాణలోనే కాకుండా ఇవాళ దేశమంతటా ఈ న్యూస్ టాప్ హెడ్ లైన్స్‌లోకి ఎక్కింది.