కరీంనగర్ లో ఐటీ టవర్.. ప్రారంభోత్పవం ఎప్పుడో తెలుసా ?
రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లో ఐటీ టవర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కోణంలోనే కరీంనగర్ లో 2018 జనవరి 8న మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో ఈ ఐటీ టవర్ ను రెండేళ్లలోనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను ఈనెల 18న మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. ఇక ఈ టవర్ను ప్రారంభిస్తే నిరుద్యోగ యువతకు ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి నియామక పత్రాలను కూడా అందజేస్తామని వారు స్పష్టం చేసారు. స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా అతి తక్కువ వ్యవధిలో దీన్ని నిర్మించారని వారు స్పష్టం చేసారు.
ముందుగా 12 కంపెనీలతో దీన్ని ప్రారంభించాలని భావించామని, ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. ఇక ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో అభివృద్ది చెందిందని వారు స్పష్టం చేసారు.