Inter Exams: ఎల్లుండి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైనా ఎంట్రీ లేదు

Inter Exams: ఒత్తిడిలో ఉంటే 14416 కు కాల్ చేయాలని.. విద్యార్థులకు సూచన

Update: 2024-02-26 12:33 GMT

Inter Exams: ఎల్లుండి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైనా ఎంట్రీ లేదు

Inter Exams: తెలంగాణలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 15 వందల 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి.. మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 29 నుంచి మార్చ్ 19 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4 లక్షల 78 వేల 718 మంది కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5 లక్షల 2 వేల 260 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదని బోర్డు పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మంచినీటి వసతులు కల్పించినట్టు అధికారులు చెప్తున్నారు. సెల్ ఫోన్లు లోపలికి అనుమతించేది లేదని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను సైతం ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఒత్తిడిలో ఉంటే 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 375 మంది విద్యార్థుల నుంచి టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్స్ వచ్చినట్టు శృతి ఓజా తెలిపారు.

విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే మంచిదని అధికారులు చెబుతున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు సైకాలజిస్టులు పలు సూచనలు చేస్తున్నారు. పరీక్షలంటే భయం వీడి.. పరీక్షలు రాసేందుకు సిద్దమవ్వాలని చెబుతున్నారు. అర్థరాత్రి వరకూ చదవకూడదని సూచిస్తున్నారు. ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండి..ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని హెచ్ఎంటివీ కోరుకుంటోంది.

Tags:    

Similar News