HYDRAA: హైదరాబాద్‌లో మూసీ నది వెంబడి టెన్షన్ టెన్షన్...
HYDRAA: హైడ్రా బుల్డోజర్లు మూసీ పరివాహాక ప్రాంతం వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుండి చెరువులు, కుంటల బఫర్ జోన్ , ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తుండగా తాజాగా కూల్చివేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదలయ్యాయి . నగరంలో సుమారు 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయించింది . ఇందులో భాగంగా మూసీకి ఇరువైపులా వంద మీటర్ల మేర జరిగిన ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. కాగా తాజాగా మూసీ పరిధిలో కూల్చివేతలు మొదలు కావడంతో ఆక్రమణలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి .
మూసీని అనుసరించి వంద మీటర్ల పరిధిలోని ఆక్రమణలు ,బఫర్ జోన్ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు . ఇందులో భాగంగా పోలీసుల సహాయంతో మూసీ వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందనేది నిర్ధారించారు . అంతేకాకుండా కొన్ని చోట్ల నోటీసులు సైతం జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వంద మీటర్ల పరిధి అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది. ఎక్కడితో ముగుస్తుందనేది అందరిలో సందేహంగా మారింది. ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడం ప్రజలు ఆందోళనకు గురైతున్నారు . కొంతమంది మూసీకి ఇరువైపులా యాభై మీటర్ల చొప్పున వంద మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుండగా మరికొంత మంది ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని మరింత ఆందోళనలకు గురి చేస్తోంది. మరికొంత మంది ఒకడుగు ముందుకు వేసి యాబై మీటర్లు ఎక్కడి వరకు వస్తుంది.. ? వంద మీటర్ల అయితే ఎంత ఉంటుందని టేపులతో కొలతలు వేసి తమ ఆస్తులు ఉంటాయా, కూలగొడతారా అనే అంచనాకు వస్తున్నారు.
గ్రేటర్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది . ముఖ్యంగా జియాగూడ కమేలా రోడ్డు ,పురానాపూల్ , అఫ్జల్ గంజ్ , చాదర్ ఘాట్, మలక్ పేట్ , అంబర్ పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసీ లో అధిక శాతం ఆక్రమణలు చోటు చేసుకున్నట్లు అధికారులు చేసిన సర్వేలో తేలింది. జియాగూడ కమేలా రోడ్డు, పురాణ పూల్, భూ లక్ష్మమ్మ టెంపుల్ సమీపంలో కొంత మంది మూసీని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇచ్చారు . దశాబ్ధాలుగా వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతూ సొంత ఆస్తులుగా వాడుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఆక్రమణలను తొలగించాలని, తమ వంటి పేద వారి నివాసాలను ధ్వంసం చేయవద్దని చాలా మంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు .
గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో మూసీని అనుసరించి కొంతమందికి గడ్డి పెంచుకునేందుకు పట్టాలు ఇచ్చారు. అయితే క్రమేణా ఆ ప్రాంతాల్లో గడ్డిని పెంచడం మానేసి మూసీని మట్టితో నింపేసి నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు . దీంతో ఆయా ప్రాంతాల్లో పక్కా నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయా నిర్మాణాలు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో వారిలో కూడా ఆందోళన మొదలైంది. గ్రేటర్ పరిధిలో 55 కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఆస్తుల వివరాలు లెక్కిస్తే ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా అధికంగా ఉండే అవకాశం ఉంది.మొత్తం మీద మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగించడం హైడ్రాకు అంత సులభం కాదు.. ముఖ్యంగా జియాగూడ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ వద్ద అసలు సమస్య ఎదురు కాబోతోంది. ఈ ప్రాంతాల్లోకి బుల్డోజర్లను తీసుకెళ్లడం అంత సులభం కాదు. అక్కడ అక్కడ కూల్చివేతల చేపట్టాలంటే భారీ పోలీసు బందోబస్తు కూడా అవసరం.. మరోవైపు ఇక్కడున్న వారికి కచ్చితంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాల్సి ఉంటుంది.. జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు..మూసి బాదిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. చంచల్ గూడ క్రాస్ రోడ్ లో 288గృహాలు నిర్మించగా 146 ఖాళీగా ఉన్నాయి. వనస్థలిపురంలో 90 గృహాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ప్రతి చోట ప్రస్తుత మూసి బాధితులకు కేటాయిస్తామన్నారు. బాధిత కుటుంబ మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు..
హైడ్రా బుల్డోజర్లు మూసీ పరివాహాక ప్రాంతం వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్లు సమాచారం. ఆ రెండు రోజుల్లోనే ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేసేలా అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్టన్లు తెలుస్తోంది. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో ముందుగా ఆక్రమణల కూల్చివేతలు చేపట్టనున్నట్లు సమాచారం.