HYDRA: హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
HYDRA: అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు
HYDRA: చెరువులు, నాలాల ఆక్రమణ... అక్రమ నిర్మాణాలపైకి బుల్డోడర్ దూసుకెళ్తోంది. తాజాగా అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు.
విక్రమ్‌యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి.. కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.