Son Refuses to Allow Mother into House: కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకు
Son refuses to allow mother into house: కరోనాను జయించి సంతోషంగా ఇంటికి చేరుకున్న ఆ తల్లికి ఊహించని వివక్ష ఎదురైంది. ఇంటిలోకి రానిచ్చేది లేదని కొడుకు, కోడలు తేల్చి చెప్పడంతో రాత్రంతా రోడ్డుపైనే గడపాల్సిన దుస్థితి వచ్చింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బీజేఆర్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ.. ఇటీవలే కరోనాబారినపడింది.. దీంతో, గాంధీఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు వైద్యులు.
శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో సాయంత్రం ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. సంతోషంగా ఇంటికి చేరిన ఆ తల్లికి అవమానం ఎదురైంది. ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న కొడుకు, కోడలు అంతే కాదు ఇంటి పైకప్పు రేకులను తొలగించి ఆ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి రోడ్డుపై రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవైపు వర్షం కూడా కురవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటన చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది ఎలాగైనా తనకు అధికారులే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది ఆ మహిళ. కాగా కరోనా వచ్చిన తర్వాత బంధాలు, బంధుత్వాలు ఏమి ఉండటం లేదు. అనవసర భయంతో తోటివారిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఇలాంటి చర్యలు తప్పు అని ప్రభుత్వాలు చెబుతున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు.