కుంభవృష్టి వానలతో వణుకుతోన్న భాగ్యనగరం.. ఈ విపత్తులు తగ్గాలంటే..

Update: 2020-10-15 09:55 GMT

వాన పడితే ఉపశమనంగా భావించే భాగ్యనగర వాసులకు ఇప్పుడు వానొస్తుందన్న వార్త వింటేనే వణుకు పుడుతోంది. గంట సేపు వాన పడినా రోజుల కొద్దీ నరకం చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపించే కాలనీలు ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షాలకు మునిగిపోతున్నాయి.

మంగళవారం ఉదయం తీరం దాటిన తీవ్ర వాయుగుండం హైదరాబాద్‌లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 10 నుంచి 20 సెంటీమీటర్ల వానలతో ఏపీలో ఏడు జిల్లాల్ని వణికించింది. లక్షల ఎకరాల్లో పంటను ముంచెత్తింది. అదేరోజు సాయంత్రానికి హైదరాబాద్‌పై విరుచుకుపడి పన్నెండు గంటల్లో 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చాలాచోట్ల పాతిక సెంటీమీటర్లకు పైగా కురిసిన కుంభవృష్టి వానతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. 1983 అక్టోబరులో నిజామాబాద్‌‌లో 24 గంటల వ్యవధిలో 35 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా భాగ్యనగరంలో 12 గంటల్లోనే 32 సెంటీమీటర్లు నమోదైంది.

సాధారణంగా నెలరోజుల్లో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల వ్యవధిలోనే కుంభవృష్టిగా కురవటంతో నగర జీవనం స్తంభించింది. చెరువులు పొంగాయి. నాలాలు నిండాయి. నగర డ్రైనీజీ సామర్థ్యానికి మించిన వరద బీభత్సం సృష్టించటంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. కళ్ల ముందే వరద కల్లోలం పీకల్లోతు నీళ్లు ఎక్కడ వెళ్లాలో తెలియదు. ఏం చేయాలో అర్థం కాదు పిల్లా జెల్లా మూటా ముల్లె పట్టుకుని మిద్దెలెక్కే పరిస్థితి ఏర్పడింది. కొందరు వరదనీటికి ఎదురెళ్లి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

ఇక ప్రకృతి విపత్తుల్లో వరదల వాటా 44శాతం కాగా, ఏటా సగటున 17 భీకర వరదలతో ఇండియా రెండో స్థానంలో నిలుస్తోంది. దీనికి చెరువులూ కుంటల్ని ఆక్రమిస్తూ చేస్తోన్న నగరీకరణే కారణమంటున్నారు నిపుణులు. రోజురోజుకూ నగరం విస్తరిస్తున్నా వరదలకు తట్టుకునే నాలాల వ్యవస్థలను ఏర్పాటు చేయకపోవటంతో నగరం వణికిపోతుంది.

అయితే 2వేల సంవత్సరంలో కిర్లోస్కర్‌ కమిటీ హైదరాబాద్‌ వరదలకు కారణాల్ని విశ్లేషించింది. నాలాలపై ఆక్రమణల తొలగింపు, నాలాల లోతు పెంపు, కొన్ని చోట్ల దారి మళ్ళింపుల్ని సిఫార్సు చేసింది. దీని ప్రకారం మానవ తప్పిదాలే నగరాల్ని ముంచుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిజాం కాలం నాటి నాలాలను ఇప్పటి పరిస్తితులకు తగ్గట్లు ఆధునీకరించటంలో ప్రభుత్వాలు విఫలమవటమే ప్రస్తుత ఈ వరద కష్టాలకు కారణమంటున్నారు విశ్లేషకులు. నాలాలపై ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అయితే రాబోయే కాలంలో ఈ విపత్తులు తగ్గాలంటే, మానవ తప్పిదాల్ని సరిదిద్దాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News