Weather Updates : భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్
రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Heavy Rains in Telangana Tomorrow: రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల వాసులు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తూ యెల్లో అలర్ట్ జారీచేసింది.
ఇవేకాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక పేర్కొంది.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరం ప్రతీ రోజూ వర్షంలో తడిసి ముద్దవుతోంది. నిత్యం పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతుండటంతో అక్కడి లోతట్టు ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్డుపైకి చేరి వరదలా మారుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.