హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబురం.. ఇవాళ సాయంత్రం 5 గం.లకు భారీ వేడుకలు
హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబురం.. ఇవాళ సాయంత్రం 5 గం.లకు భారీ వేడుకలు
hmtv Mega Bathukamma: తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, పల్లెపడుచుల ఆనందాల వేదిక, తొమ్మిది రోజుల ముచ్చటైన పండగ.. బతుకమ్మ. పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. బంధాలు, అనుబంధాలను గుర్తు చేస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేదే బతుకమ్మ పండుగ. గౌరీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే.. తెలంగాణకే తలమానికమైన బతుకమ్మ సంబరాలు.. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని తాకుతున్నాయి. అలాంటి చారిత్రక వేడుకలు.. హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన మెగా బతుకమ్మ వేడుక కోసం కోసం సర్వం సిద్ధమైంది. యావత్ రాష్ట్రం నుంచి తరలిరానున్న మహిళలతో.. కళాకారుల ఆట పాటలతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి.
బతుకమ్మ.. బతుకునిస్తుంది. ప్రకృతిని ప్రేమించేలా చేస్తుంది. మనుషుల మధ్య ఆప్యాయతలను పెంచుతుంది. సంప్రదాయలను గుర్తు చేస్తుంది. సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.. బతుకమ్మ. దేవుడిని పూజించాలంటే పూలు కావాలి. కానీ ఆ పూలనే పూజించే పండగ.. మన బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నం.. తరతరాల చరిత్రకు ప్రతీక.. ప్రకృతికి, మనిషికి గల సంబంధాన్ని ప్రతిబింబించే పండుగ.. బతుకమ్మ. ఈ పండగలో ఆటలున్నాయి, పాటలున్నాయి. ముచ్చట్లు ఉన్నాయి. కష్టసుఖాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఇవే కాదు.. మొత్తంగా ఈ పండుగలో తెలంగాణ జీవన చిత్రమే దాగుంది. అలాంటి బతుకమ్మ ఉత్సవాలను.. ఈ సారి హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అక్టోబర్ 1, శనివారం.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబురాలకు వేళైంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తరలిరానున్న వేలాదిగా మహిళలు, ఆడబిడ్డలతో.. స్టేడియం నిండిపోనుంది. బతుకమ్మ పండగ అంటే జానపదాలతో పాటల అల్లిక. సహజత్వం నిండిన మనస్సుకు హత్తుకునే అలాంటి పాటలు పాడేందుకు గ్రామీణ కళకారులు రానున్నారు. వారందరిచేత ఏర్పాటు చేయనున్న కార్యక్రమాల్లో.. బతుకమ్మ పాటలు పాడించనున్నారు.
మరోవైపు అమ్మాయిలు, మహిళలు.. ఆట పాటలతో మెగా బతుకమ్మ సంబరాలు జరుపుకోనున్నారు. దాండియా, కోలాటాలతో హోరెత్తించనున్నారు. ఓ వైపు కళాకారుల జోరు.. మరోవైపు ఆడబిడ్డల హోరుతో.. స్టేడియంలో ఎటు చూసినా ఆనందాల వెల్లువే. సంతోషాల సంబరాలే. ఇక హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బతుకమ్మ సంబరాలకు తరలివచ్చేందుకు మహిళా లోకం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మహిళలంతా తరలివచ్చేందుకు రెడీ అవుతున్నారు. దారులన్నీ హైదరాబాద్ వైపే అన్నట్లు.. పలు చోట్ల హోర్డింగులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంబరాలకు.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాము తప్పకుండా తరలివస్తామని.. మహిళలు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా.. ఉత్సవాలకు వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆట పాటలు, నృత్యాలు, దాండియా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈవెంట్ పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలను సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇక ఇప్పటికే హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో విడుదలైన బతుకమ్మ పాట.. రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిపోతున్నాయి. ఎక్కడ చూసినా.. హెచ్‌ఎంటీవీ బతుకమ్మ పాటలతో మహిళలు ఆటలు ఆడుతున్నారు. సాహిత్యంతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరించేలా ఉండటంతో.. ముఖ్యంగా అమ్మాయిలు ఈ పాటలతోనే బతుకమ్మ ఆడుతున్నారు. కొన్నిచోట్ల ఈ పాటకు కోలాటాలు కూడా ఆడుతున్నారు.
మరోవైపు హెచ్‌ఎంటీవీ మెగా బతుకమ్మ సంబరాలపై రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హెచ్‌ఎంటీవీ ప్రయత్నాన్ని అభినందించారు. సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తూ.. పండగ ప్రాముఖ్యతను నేటి తరాలకి తెలియజేస్తున్న హెచ్‌ఎంటీవీ ప్రయత్నం.. ప్రశంసనీయం అని కొనియాడారు.
9 రోజుల ఉత్సవాన్ని.. ఒకేరోజు, ఒకే చోట చూపించేలా.. భక్తులను మైమరిపించేలా హెచ్‌ఎంటీవీ మెగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుక కోసం.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణకు పలువురు ప్రముఖుల సమక్షంలో.. ఈ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.