Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్.. కొనసాగుతోన్న ఆపరేషన్ ‘చిరుత’
Shamshabad: 7 అడుగుల ఎత్తైన గోడ దూకి లోపలికి ప్రవేశించిందని గుర్తింపు
Shamshabad: చిరుత సంచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర కాలనీలవాసులు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా అదనంగా మరో మూడు బోన్లను సైతం ఏర్పాటు చేశారు. ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. ఇప్పుడు అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు భావిస్తున్నారు. ఏడు అడుగుల ఎత్తైన గోడను దూకి ఎయిర్‌పోర్టు రన్‌వేలోకి చిరుత ప్రవేశించిందని చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిట్టడివి ఉండటంతో చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌ఓ విజయానంద్ తెలిపారు. అక్కడ నీటి కుంట, ఆహారం దొరికే అవకాశం ఉన్నందున అదే ప్రాంతంలో చిరుత సంచిరిస్తుందన్నారు. ట్రాప్‌లు ఏర్పాటు చేశాం.. శంషాబాద్ పరిసర ప్రజలెవరూ భయపడొద్దని ఆయన చెబుతున్నారు. చిట్టడివి కావడంతో చిరుతలు ఉంటాయని, కానీ ఇవి వేటాడే జంతువులు కాదని డీఎఫ్‌ఓ చెప్పారు. అయితే రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.