Telangana: ముగిసిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

Telangana: రెండు స్థానాలకు వంద మందికిపైగా అభ‌్యర్థులు నామినేషన్‌లు దాఖలు

Update: 2021-02-24 02:57 GMT

Representational Image

Telangana: తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాలకు వంద మందికిపైగా అభ‌్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా.. 24న నామినేషన్లను పరిశీలిన జరగనుంది. 26వరకు ఉపసంహరణకు ఛాన్స్‌ ఉండగా అదేరోజు సాయంత్రం అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ విడుదలకానుంది. అదేవిధంగా మార్చి 14న పోలింగ్‌.. 17న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి స్థానానికి టీఆర్ఎస్‌ అభ‌్యర్థిగా చివరి క్షణంలో పీవీ కూతరు వాణి దిగడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహాబూబ్‌నగర్‌లో మొత్తం 5లక్షల 21వేల 386 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 3లక్షల 29వేల 888 మంది పురష ఓటర్లు ఉండగా.. లక్షా 91వేల 430 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా వరంగల్‌-ఖమ్మం-నల్గొండలో 4లక్షల 92వేల 943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురష ఓటర్లు 3లక్షల 24వేల 381 మంది కాగా.. మహిళా ఓటర్లు లక్షా 68వేల 480 ఉన్నారు. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా మారాయి. హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికల తర్వాత వచ్చిన ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు పార్టీల అభ్యర్థులకు తామేమి తక్కువకాదన్నట్టు స్వంతంత్ర అభ‌్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానానికి సిట్టింగ్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి టీఆర్ఎస్‌ మరో అవకాశం కల్పించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ‌్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, బీజేపీ నుండి ప్రేమ్‌చందర్‌ రెడ్డి, టీజేఎస్‌ నుండి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ బరిలో ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నుండి చెరుకు సుధాకర్‌ పోటీచేయనుండగా.. వామపక్షాల తరపున సీనియర్ జర్నలిస్ట్‌ జయసారథి రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుండి రాణి రుద్రమా రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పోటీ చేస్తున్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూర్‌ స్థానానికి మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణిదేవిని టీఆర్ఎస్‌ రంగంలోకి దించింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎల్‌.రమణ కాగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్‌ రావును బీజేపీ మరోసారి బరిలో దింపింది. కాంగ్రెస్‌ అభ‌్యర్థిగా చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, మేజీషియన్‌ సామల వేణుతోపాటు మరికొంతమంది స్వంత్రత్య అభ‌్యర్థులు బరిలోకి దిగారు.

మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ, వామపక్షాలు తాపత్రయ పడుతున్నాయి. ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు తెలంగాణ బ్రాండ్‌ ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి తన గెలుపుతో సొంత ఇమేజ్‌ పెంచుకుందామని ఆశగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రొఫెసర్‌ నాగేశ‌్వర్‌ తనదైన వ్యూహంతో గ్రాడ్యుయేట్‌ల మనసు దోచుకునే విదంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొత్తానికి విక్టరీ కొట్టి పట్టునిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుంటే.. గెలిచి పట్టు పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ తహతహలాడుతున్నాయి.

Tags:    

Similar News