మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి ముహుర్తం ఫిక్స్..?

Telangana: 20 నెలలుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఛైర్మన్ పదవి

Update: 2023-02-02 05:26 GMT

మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి ముహుర్తం ఫిక్స్..?

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నియామకం జరగనుందా..? మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా సీఎం కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారు..? అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను నియమిస్తారనే చర్చ జరుగుతోంది. గత 20 నెలలుగా శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. మండలి డిప్యూటీ ఛైర్మన్‌‌గా ఉన్న నేతి విద్యాసాగర్ పదవీకాలం ముగిసినప్పటి నుంచి డిప్యూటీ ఛైర్మన్‌ పదవీ ఖాళీగా ఉంది. అయితే ఈపదవిని సీఎం కేసీఆర్ భర్తీ చేస్తారని అనేక సందర్భాల్లో ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు.

తాజాగా బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నియామకం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, బండా ప్రకాష్ ముదిరాజ్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి పేర్లు వినపడుతున్నాయి.

మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రేసులో ఉన్న వారిలో ఎల్.రమణ T.TTD రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటూ BRSలో చేరారు. BRSలో చేరిన తర్వాత కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. BRSలో చేరిన తర్వాత సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ముదిరాజ్‌ను ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాష్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని భావించారు. అందుకోసమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్‌ను రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడంతో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక కేసీఆర్ తొలి కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కడియం శ్రీహరికి రెండవ సారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు మండలి డిప్యూటీ ఛైర్మన్ రేసులో కడియం పేరు సైతం వినిపిస్తోంది. ఇక తెలంగాణ మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీని చేశారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన అనుభవం ఉండటంతో ఇప్పుడు మండలి డిప్యూటీ ఛైర్మన్‌‌గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో గత 20 నెలలుగా ఖాళీగా ఉన్న మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవిని ఈ సారి జరిగే సమావేశాల్లో భర్తీ చేస్తారనే ఊహాగానాలు వినపడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా మండలి డిప్యూటీ చైర్మన్‌ను భర్తీ చేస్తారనే చర్చ BRS వర్గాల్లో జరుగుతోంది.

Tags:    

Similar News