Telangana: ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
Telangana: గత సీజన్‌లో రికార్డు ధర పలికిన పత్తి, మిర్చి ధర
Telangana: ఖరీఫ్ కాలం మొదలైంది. తొలకరి వర్షాలతో పంట సాగు కోసం రైతన్నలు పొలాల్లో తీరిక లేకుండా పనులు చేస్తున్నారు. అయితే ఈ సారి వరికి భిన్నంగా పత్తి ,మిర్చి పంట సాగుపై రైతన్నలు దృష్టి సారించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో పత్తి ,మిర్చి పంటవైపు రైతన్నలు ఆసక్తి చూపిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఖరీప్ సాగుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం
రబీ సీజన్‌లో వచ్చిన ధాన్యంపై కోనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. కాగా కొనుగోలు కేంద్రాలలో కూడా రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో గత సీజన్‌లో రికార్డు స్థాయి ధరలతో సిరులు కురిపించిన పత్తి పంట సాగుతో పాటు... మిర్చి పంట సాగుపై రైతన్నలు ఈసారి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వరి పంట తీసిన పొలాల్లో పత్తి గింజలు నాటారు. ఇక మిర్చి పంట సాగు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పత్తి పంట సాగులో తెలంగాణలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. గత మూడేళ్లుగా నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో పత్తి పంట సాగవుతోంది. ఈసారి కూడా అదే స్థాయిలో పత్తి పంట సాగు చేపట్టారు రైతులు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కూడా పత్తి పంట సాగు పట్ల రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే పత్తి గింజలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పత్తి పంటవైపు అన్నదాతలు మొగ్గుచూపారు. ఖమ్మం జిల్లాలో గత సీజన్‌లో రికార్డు స్థాయి ధరను అందుకున్న రైతులు గత ఈ సారి మిర్చి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఈసారి పత్తి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వేరుశనగ పంటతో పాటుగా పత్తి సాగు విస్తీర్ణం ఈసారి పెరగనుందని అంచనా. పత్తి పంటకు మద్దతు ధర రావడం వరి సాగు వల్ల వస్తున్న ఇబ్బందులతో పత్తి సాగుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు రైతులు.
గత సీజన్‌తో వరి ధాన్యంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో పత్తి, మిర్చి సాగు చేసిన రైతులకు రికార్డు స్థాయిలో ధర వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధరతో మిర్చిధర పోటీ పడింది. పత్తికి సైతం రికార్డు స్థాయిలో ధర రావడంతో దక్షిణ తెలంగాణలో పత్తి, మిర్చి పంటల పెరుగుదల కనిపిస్తోంది. ఈ సారి మెట్ట పంటల విస్తీర్ణం పెంచాలని దానికి రైతులను సమయత్తం చేయాలని మంత్రులు కూడా కోరడంతో అయా అధికారులు మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వరి పంటకు ఎదురవుతున్న ఇబ్బందులకు తోడు మార్కెట్ లో పత్తి మిర్చికి ఉన్న డిమాండ్‌తో ఈసారి రైతులు మెట్ట పంటలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతన్నల ఆసక్తి మేరకు, మిర్చి పత్తి పంటలకు ఎక్కువగా ఎరువులు అవసరం ఉంటాయి. ఎరువుల కొరతతో పాటు నకిలీ విత్తనాల సమస్య లేకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు.