KCR: ఎన్నికల ప్రచార సభల్లో మాటలే మంత్రదండాలు.. చమక్కులతో ప్రసంగాలను రక్తి కట్టిస్తున్న కేసీఆర్‌

KCR: హిందీ, ఇంగ్లిష్‌, తెలుగులో దంచి కొట్టే ప్రసంగాలు

Update: 2023-11-11 12:55 GMT

KCR: ఎన్నికల ప్రచార సభల్లో మాటలే మంత్రదండాలు.. చమక్కులతో ప్రసంగాలను రక్తి కట్టిస్తున్న కేసీఆర్‌

KCR: కేసీఆర్ మాటే మంత్రదండం. ఆ మాటల్లోనే ఓ వ్యూహం. చమక్కులతో ప్రసంగాన్ని రక్తి కట్టిస్తారు. వెటకారంతో ప్రత్యర్థులను వేడెక్కిస్తారు. ఒక్క పిలుపుతో కోట్లాదిమందిని కదిలిస్తారు. లక్ష్యం వైపు సమ్మోహితులను చేస్తారు. ఉద్యమం వైపు ఉరకలెత్తిస్తారు. తెలంగాణ వ్యతిరేకులను చెడామడ తిడుతూ రెచ్చిగొట్టి మరీ...గిచ్చి రేపెట్టుకుంటారు. తాను మాట్లాడే ప్రతి మాట చర్చకు వచ్చేలా వ్యూహాత్మకంగా మాట్లాడతారు. తెలంగాణ సాధనలో మాట కూడా కేసీఆర్ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రమైంది.

కేసీఆర్ మాటల్లో పంచ్ ఉంటుంది. వెటకారం మిళితమై ఉంటుంది. చాతుర్యం కొత్త పుంతలు తొక్కుతుంది. చమక్కులకు కొదువే ఉండదు. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడే ప్రతి మాట చురకత్తిలా గుచ్చుకుంటుంది. సూటిగా, సుత్తి లేకుండా విసిరే పంచ్ డైలాగులతో వేదిక ఏదైనా దద్దరిల్లాల్సిందే. కేసీఆర్‌పై కౌంటర్లేస్తే ఎన్‌కౌంటరే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ఉద్యమ వేడి రగిలించేందుకు ఆయన ప్రతి మాటను తూటాలా పేల్చారు.

తెచ్చుకున్న తెలంగాణలో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారాయన. కేసీఆర్‌ బాధ్యతల గల నాయకుడు. బాధ్యతగా వ్యవహరించాలని చెప్పే మాస్టార్‌. అందుకే తెలంగాణ తెచ్చుకునేందుకు ఎలాంటి పదునైన పదజాలం వాడారో... వచ్చిన తెలంగాణలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు అంతే పొదుపుగా తన భాషను వాడారు. ఏమైనా కేసీఆర్‌ మాటే మంత్రం. ఆయన ప్రసంగం ఓ సమ్మోహనాస్త్రం. అద్భుతమైన వక్తల జాబితాలో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగులోనే కాదు ఉర్దూ, హిందీ భాషల్లోనూ అనర్గళంగా ప్రసంగిస్తారు. ఇంగ్లీష్ లోనూ దంచికొట్టే ప్రసంగాలు చేయగలరు. ప్రత్యర్థులు కూడా ఆయన ప్రసంగాన్ని ఆసాంతం వింటారు. శైలీవిన్యాసం, చమక్కులు కేసీఆర్ సొంతం. భాషపైనా యాసపైనా మాండలికాలపైనా లోతైన అవగాహన ఉన్న కేసీఆర్...మైకు పట్టాడంటే....ప్రత్యర్థులకు వణుకే.

చిన్నప్పటి నుంచే తెలుగు భాషపై మమకారం పెంచుకున్న కేసీఆర్‌... పద్యాలు, పిట్టకథలు, సామెతలతో ప్రసంగాలను దంచికొట్టేవారు. వేదిక ఏదైనా కేసీఆర్ ప్రసంగం సూపర్ హిట్. ఎంతమంది నాయకులు మాట్లాడినా....కేసీఆర్ మాటల కోసమే సభికులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతమున్న రాజకీయ నాయకుల్లో కేసీఆర్ మాట్లాడినంత సరళంగా, సూటి, స్ఫూర్తివంతంగా ఎవరూ మాట్టాడలేరంటే అతిశయోక్తి కాదు. 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్.... మాటలతోనే ఉద్యమాన్ని సజీవంగా ఉంచగలిగారు. జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడే....తెలంగాణ కోసం తలయినా నరుక్కుంటానని శపథం చేశారు. సభలు, సమావేశాల్లో మాటలతోనే జనాన్ని సమ్మోహితులను చేశారు. కోట్లాదిమందిని కేవలం తన నోటితోనే శాసించారు కేసీఆర్.

మాటలనే ఈటెలుగా సంధిస్తూ కేసీఆర్ దంచికొట్టే ప్రసంగాలకు తెలంగాణ జేజేలు కొడుతోంది. నిండైన ఆత్మవిశ్వాసంతో చెప్పే గులాబీ దళపతి చెప్పే మాటలే నిరాశనిస్పృహలను తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్‌పై మూడోసారి భరోసా ఇస్తూ మైమరిపిస్తున్నారు. జయాలు, అపజయాలపై దేనికీ పొంగిపోని, కుంగిపోని కేసీఆర్ వ్యక్తిత్వమే తమ గుండె ధైర్యమంటోంది కోట్లాదిమంది ప్రజానీకం. బక్క పల్చని నాయకుడు.... బలమైన తన మాటలు, వ్యూహాత్మక ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాదు... తెచ్చిన రాష్ట్రాన్ని ప్రగతి పథాన పయనింపచేస్తున్నారని చెప్పుకుంటోంది. తెలంగాణ సాధకుడిగా నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కేసీఆరే... హ్యాట్రిక్‌ సీఎం అంటూ నినదిస్తోంది.

Tags:    

Similar News