Rythu Bandhu: రైతుబంధు పంపిణీకి బ్రేక్‌.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ

Rythu Bandhu: ఫిర్యాదులు రావడంతో.. రైతుబంధు పంపిణీని నిలిపివేయాలని నిర్ణయం

Update: 2023-11-27 04:41 GMT

Rythu Bandhu: రైతుబంధు పంపిణీకి బ్రేక్‌.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ

Rythu Bandhu: తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.

యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఈ నెల 28 వరకు రైతుబంధు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి 5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం 10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ మూడు రోజుల క్రితం నిధుల జమకు అనుమతి మంజూరు చేసింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశించింది. తాజాగా ఆ అనుమతిని ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈసీ అనుమతి నిరాకరణతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోనుంది.

Tags:    

Similar News