Rain Alert: హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపిన తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1న వర్షాలు షురూ అయ్యాయి. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం, గురువారం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది.
ఈ వర్షాల కారణంగా భూ ఉపరితలం వేడెక్కడంతోపాటు దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల చక్రవాతం ఆవర్తనం ద్రోణి ప్రభావం అని వాతావరణ శాఖ తెలిపింది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో సుమద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన చక్రవాత ఆవర్తనం మంగళవారం నుంచి మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతోంది. దక్షిణ చత్తీస్ గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి కూడా వర్షాలకు దోహదంచేస్తుంది. ఈ వాతావరణ ప్రభావం వల్ల తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వడగండ్ల వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వల్ల రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వేడి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుందని తెలిపింది. ఈ వర్షాలు రైతులకు పంటల పరిరక్షణలో సహాయపడినప్పటికీ, ఈదురు గాలులు, వడగండ్ల వానల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి 5 రోజులపాటూ.. ఏపీ అంతటా మేఘాలు ఉంటాయని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా.. రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.