Coronavirus: నిజామాబాద్ జిల్లాను చుట్టు ముడుతున్న కరోనా

Coronavirus: ఐదు రోజుల వ్యవధిలో 200 పాజిటివ్ కేసులు నమోదు

Update: 2021-03-21 05:07 GMT

కరోన వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: ఇందూరు పై కరోనా పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో 200 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృత్యువాత పడటం ఆందోళన కు గురిచేస్తోంది. 24 గంటల వ్యవధిలో ఓ గ్రామంలో 16 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా కట్టడికి స్వచ్చంద లాక్ డౌన్ కు పల్లెలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కరోనా చుట్టు ముడుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటు పల్లె నుంచి పట్నం వరకు జనం కరోనా బారిన పడుతుండటంతో పల్లెలు కరోనా కట్టడికి స్వచ్చంద లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మోపాల్ మండల కేంద్రంలో గ్రామస్ధులు లాక్ డౌన్ ప్రకటించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐదొందల నుంచి ఐదు వేల వరకు జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేని వారికి 100 రూపాయలు జరిమానా విధించేలా తీర్మాణం చేశారు. మోపాల్ లో 16 మందికి పాజిటివ్ నిర్దారణ కావడంతో కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.

నిజామాబాద్ - కామారెడ్డి జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో సుమారు 200 మంది వైరస్ బారిన పడ్డారు. కామారెడ్డిలో కరోనా బారిన పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతంతో పోలిస్తే వైరస్ తీవ్రత అంతగా లేకపోయినా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సుమారు 3 వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. సరిహద్దు గ్రామాలు కరోనా భయంతో వణికి పోతున్నాయి. స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కోవిడ్ పరీక్షలు నిర్వహించి జిల్లాలోకి అనుమతిస్తున్నారు. కోవిడ్ బారినపడ్డ వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు.

ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు కోవిడ్ టీకా పక్రియ జోరుగా కొనసాగుతోంది. రోజుకు 700 మందికి కరోనా టీకా వేస్తున్నారు. కేసులు పెరగడంతో.. కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు.

కరోనా సెకెండ్ వేవ్ కట్టడికి ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భౌతిక దూరంతో పాటు మాస్క్ తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కట్టడికి అధికారులు అలెర్ట్ కావడంతో..పరిస్ధితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు.

Tags:    

Similar News