Revanth Reddy: రేవంత్ కు నో అపాయింట్మెంట్
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చాలామంది కలుస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చాలామంది కలుస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక దూకుడు పెంచూ అంటూ భుజం తడుతున్నారు. కానీ కొందరు కీలకమైన నేతలు మాత్రం, రేవంత్‌ను కలవడం లేదు. టట్ మీ నాట్ అన్నట్టుగా దూరందూరం జరుగుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొత్త పీసీసీ అధ్యక్షున్ని ఎందుకు కలవడం లేదు?
కాంగ్రెస్ పార్టీలో నేతలకు వుండే కిక్కే వేరు. ఏ పార్టీలోనూ లేనంత ఫ్రీడమ్ ఈ పార్టీలో పుష్కలం. ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం, పర్థం కాంగ్రెస్సే. ఒకే పార్టీలో వున్నా తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, కౌగలించుకుంటారు, కలబడతారు వారెవ్వా ఎవరి స్వేచ్చ వారిదే. అదే కాంగ్రెస్ బలం, అదే బలహీనత కూడా. ఇదంతా ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథిగా రేవంత్ రెడ్డి అపాయింట్ అయ్యారు. ఒక్కసారిగా గాంధీభవన్‌లో ఆటంబాంబు పేలుతుందని నాడు జోస్యం చెప్పారు. కానీ ఇప్పుడక్కడ అంత సన్నివేశం లేదు. కోమటి రెడ్డి తప్ప మిగతావాళ్లంతా గప్‌చుప్. లోలోపల రగిలిపోతున్నారు. మొన్నటి వరకు హడావుడి చేసి, రేవంత్‌ను వ్యతిరేకించినవాళ్లంతా ఉడికిపోతున్నారు. ఇప్పటి వరకు కొత్త అధ్యక్షున్ని కలవకుండా, విషెస్ చెప్పకుండా, కలిసి సాగుదామన్న మాటే లేకుండా గుంభనంగా ఎవరింట్లో వాళ్లుంటూ కుతకులాడిపోతున్నారట.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే, అనేక గ్రూపులు, అసంతృప్తుల నిలయం. చాలారోజులుగా పార్టీలో పీసీసీపై ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలు ఫైరవీలు చేసుకున్నారు. కానీ కథ అడ్డంతిరిగిందన్నట్టుగా, వారికి ఢిల్లీ అధిష్టానం లాస్ట్ పంచ్ విసిరింది. దీంతో తానంటే లోలోపల అగ్నిగుండంలా మండిపోతున్న వారిని చల్లబర్చడమే ఫస్ట్ టాస్క్‌గా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. తనను వ్యతిరేకించిన నేతలందరిని వరుసబెట్టి కలుస్తున్నారు. పార్టీలో అందరికంటే ముందుగానే రేవంత్ రెడ్దిని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను కలవడంతో, పార్టీలో మెజార్టీ అసంతృప్తుల బెడద తగ్గినట్లేనని పార్టీలో భావించారు. కానీ పార్టీలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే, ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే రేవంత్ రెడ్డిని కలిసారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఎంపీల్లో ఒక్కరు కూడా రేవంత్‌తో భేటి కాలేదు. దీంతో పార్టీలో వివాదాలకు ఇంకా పుల్‌స్టాప్ పడనట్లేననే చర్చ సాగుతోంది.
కేవలం సీతక్క మాత్రమే ఇప్పటి వరకు రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పోడెంవీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు దూరంగా ఉన్నారు. వీళ్లందరిని కలువడానికి నాలుగు రోజులుగా రేవంత్ ప్రయత్నం చేస్తున్నా, వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారట. ఇప్పటికే ఎంపీ వెంకట్ రెడ్డి తనను కలవడానికి రావొద్దు అంటూ ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తాను అందుబాటులో లేనని చెప్పి తప్పించుకుంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలను కలవడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇప్పుడే కలవలేం, బిజీగా వున్నామంటూ రేవంత్‌కు రిప్లై ఇస్తున్నారట. మరి వీరందరూ రేవంత్‌ను ఎప్పుడు కలుస్తారో, కలవడానికి ప్రయత్నిస్తున్న రేవంత్‌కు టైం ఎప్పుడిస్తారో ఎప్పుడు కలిసి కలబడతారో.