నేటి నుంచి నెల రోజుల పాటు కాంగ్రెస్ రైతు రచ్చబండ...
Congress - Rythu Rachabanda: 12వేల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం...
Congress - Rythu Rachabanda: వరంగల్ రాహుల్ సభ, ఉదయ్‌పూర్ సమావేశం తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ, రాహుల్ గాంధీ ప్రసంగంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గం అభిప్రాయపడింది.
కార్యకర్తల్లో జోష్ కంటిన్యూ అయ్యేలా నేటి నుంచి రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. .చారిత్రక నేపథ్యం ఉన్న అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ రచ్చబండలు జరగనున్నాయి. ఈ రచ్చబండ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కీలక నేతలు హాజరై ప్రసంగిస్తారు. 12 వేల పంచాయతీల్లో జరగనున్న రచ్చబండలకు 400 మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఆచార్య జయశంకర్ స్వ్రగామం అక్కంపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదురుకూరు గ్రామంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క రచ్చబండ నిర్వహిస్తారు.
కొమురవెల్లి గ్రామంలో పొన్నాల లక్ష్మయ్య, హుజుర్ నగర్ లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం చేపడుతారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలం కేంద్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, కామారెడ్డి రూరల్ మండలం గూడెం గ్రామంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి, కరీంనగర్ పరిదిలోని నగునూరు గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు.