Ganga Reddy Murder Case: కాంగ్రెస్ పార్టీకి ఓ నమస్కారం.. గంగారెడ్డి హత్య తరువాత జీవన్ రెడ్డి
Ganga Reddy Murder Case: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. తన అనుచరుడిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.సంతోష్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై జీవన్ రెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.సంతోష్ నుండి ప్రాణ హానీ ఉందని గంగా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా పోలీసులను జీవన్ రెడ్డి గట్టిగా నిలదీశారు. గంగారెడ్డిని చంపిన సంతోష్ ఒక రౌడీ షీటర్. అతడిపై 20 ఫిర్యాదులున్నాయి. మొన్నటికిమొన్న బతుకమ్మ పండగనాడు డీజే పగలకొట్టిండని బాధితులు సంతోష్‌పై ఫిర్యాదు చేశారు.అప్పుడు కూడా మీరు సంతోష్‌ని పట్టుకుని ప్రశ్నించలేదు.గంగారెడ్డిని చంపుతానని సంతోష్ బెదిరించినప్పుడు పోలీసులకు 100 డయల్ చేసి ఫిర్యాదు చేసినప్పుడు కూడా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని జీవన్ రెడ్డి పోలీసుల ఎదుట వాపోయారు.
కాంగ్రెస్‌పైనా జీవన్ రెడ్డి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎన్ని సమస్యలొచ్చినా గత 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాను.అందుకు తగిన బహుమతి ఇచ్చారు అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని చెబుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తమ అభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని చెబుతూ మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అని అన్నారు.