ఇకనైనా మేలుకోండి.. పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దండి : విజయశాంతి

Update: 2020-08-18 12:06 GMT

తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని రాష్ట్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. తాజా పరిణామాలే దీనికి నిదర్శనమని ఫేస్ బుక్ వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.

విజయశాంతి పెట్టిన పోస్ట్ యధాతదంగా..

తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైంది. ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోంది. తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ... కోవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యం. ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చు. ఇకనైనా మేలుకోండి.. పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దండి.

విజయశాంతి,

చైర్ పర్సన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ



 








Tags:    

Similar News