Cold War Between TRS leaders: నకిరేకల్‌‌లో టగ్‌ ఆఫ్‌ వార్‌‌‌లో క్లైమాక్స్‌ సీన్‌ సిద్దమైందా?

Update: 2020-07-06 08:48 GMT

Cold War Between TRS Leaders in Nakrekal : అధికార పార్టీలో ప్రతిపక్ష పంచాయతీ మీరెక్కడైనా చూశారా? పవర్‌వున్న పార్టీలోనే వుంటూ, పరస్పరం పోలీసు స్టేషన్‌ మెట్లెక్కిన లీడర్ల సంగతి విన్నారా?ప్రత్యర్థులుగా కత్తులు దూసుకుని, ఒకే పార్టీలో చేరిన నాయకుల వైరం, ఇప్పుడు సమరాన్ని తలపిస్తోంది. ఎంతకీ ఎవరా లీడర్లు?

నకిరేకల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్‌హాట్‌ రాజకీయాల కేరాఫ్. చిరుమర్తి లింగయ్య, ప్రస్తుతం నకిరేకల్ ఎమ్మెల్యే హస్తం గుర్తు నుంచి గెలిచి, కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. వేముల వీరేశం నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌ నేత మొన్నటి ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు వీరేశం. ఎన్నికల్లో ప్రత్యర్థుల్లా తలపడిన ఈ ఇద్దరు నాయకులు, ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే వున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా అన్న ప్రశ్నకు, ఇమడవనే సమాధానం. అందుకు వీరిద్దరి ప్రచ్చన్నయుద్ధమే నిదర్శనం.

నకిరేకల్ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారు లింగయ్య, వీరేశం. వీరి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఏడాది క్రితం చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ లో చేరాక, అసలు రాజకీయం మొదలైంది. సంవత్సర కాలం నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణలు, దాడులు సైతం చోటు చేసుకున్నాయి. పరస్పరం పోలీసులు స్టేషన్లలో కేసులు పెట్టుకోవడం పరిపాటి అయ్యింది. ప్రస్తుతం టిఆర్ఎస్‌లో రెండు గ్రూపుల వల్ల కాంగ్రెస్ నేతలకు పని లేకుండా పోయింది. ఎవరిది లింగయ్య వర్గమో, ఎవరిది వీరేశం వర్గమో అర్ధంకాని పరిస్థితి టీఆర్ఎస్‌లోనూ నెలకొంది.

ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ లో రెండు వర్గాలు పరస్పరం పోటీ చేశాయి. ఎవరికి వారే ఆయా వర్గాలుగా కంటెస్ట్ చేసి, నువ్వానేనా అన్నట్టుగా ఆధిపత్యం కోసం వ్యూహాలు వేశారు. ఇక లింగయ్య ఎమ్మెల్యే హోదాలో అధికారులను ఉపయోగించి తమ వర్గం నేతలపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏకంగా నకిరేకల్ సెంటర్‌లో ధర్నానే చేశారు. ఇరు వర్గాల‌వారు పెద్దఎత్తున కేసులు పెట్టుకుంటూ, రచ్చరచ్చ చేస్తున్నారు.

నకిరేకల్ లో లింగయ్య ,వీరేశంల పంచాయతీ మంత్రి జగదీష్ రెడ్డికి తెలిసినా, ఇరు వర్గాలను మంత్రి ఏమీ చెయ్యలేని పరిస్థితి. ‌గతంలో వేముల వీరేశం‌, మంత్రికి చాలా దగ్గర. ఇపుడు వీరేశంతో పాటు లింగయ్య కూడా మంత్రికి దగ్గరయ్యారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి ఇరువురు నేతలను కంట్రోల్ చెయ్యలేక తలపట్టుకుంటున్నారు. నకిరేకల్ పంచాయతీ కేటీఆర్‌తో పాటు కేసీఆర్ దగ్గరకూ చేరింది. ‌పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని హెచ్చరించారట కూడా. అయినా సరే, అటు లింగయ్య, ఇటు వీరేశంల మధ్య ఆధిపత్య పోరుకు మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు.

ఇరువర్గాల నుంచి వచ్చే ఒత్తిడితో అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట. చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే హోదాలో వేముల వీరేశం ఇద్దరూ పూర్తిస్థాయిలో తమ అనుచరుల కోసం అధికారులపై తీవ్రఒత్తిడి చేస్తున్నారట. ఈరేంజ్‌లో సాగుతోంది నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం వర్గాల మధ్య యుద్ధం. వేర్వేరు పార్టీల్లో కొన్నేళ్లుగా ప్రత్యర్థులుగా తలపడిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు ఒకే పార్టీలో వుండటమే సమరానికి కారణం. ఇది ముందు నుంచి ఊహించిందే. ఇద్దరికీ నకిరేకల్లే ఉనికి. ఇద్దరూ ఎమ్మెల్యే ఆకాంక్షలున్నవారే. కానీ ఒక్కరే ఎమ్మెల్యే అవుతారు. అందుకే వీరి మధ్య ఉనికి కోసం పోరాటం. మరి వీరేశంకు ఏదో ఒక పదవి ఇచ్చి అధిష్టానం చల్లారుస్తుందా లేదంటే ఇద్దరిలో ఒకరినే ఎంచుకుని, మరొకరిని లైట్ తీసుకుంటుందా అన్నదానిపైనే, నకిరేకల్‌లో తగాదాలకు ముగింపు. మరి రానున్న కాలంలో ఏం జరుగుతుందో చూడాలి.


Full View


Tags:    

Similar News