Revanth Reddy: 6 గ్యారెంటీల ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం

Revanth Reddy: కాంగ్రెస్‌ గ్యారెంటీలు: యువ వికాసం, చేయూత

Update: 2023-12-07 09:29 GMT

Revanth Reddy: 6 గ్యారెంటీల ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం

Revanth Reddy: రేవంత్ రెడ్డి మాటంటే మాటే. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా చేసి చూపించారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు నీటి మూటలు కాకుండా.. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే అచరణలోని తీసుకొచ్చారు. దటీస్ రేవంత్ రెడ్డి. సాధారణంగా నాయకులు ప్రచారంలో చాలా మంది చాలా హామీలు ఇస్తారు. అధికారంలోకి వస్తే చేస్తామని మాటలు చెప్తారు. తర్వాత నెరవేరేది ఎన్నో, అమలు అయ్యేది ఎన్నో. మనం చూస్తూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటను ప్రమాణం స్వీకారం చేసిన గంటలోనే నిలబెట్టుకున్నారు.

సీఎంగా రెండు ఫైళ్లపై సంతకం చేశారు. ఒకటి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై.. తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ఎన్నికల ప్రచారంలో నాంపల్లికి చెందిన ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను పీజీ చేసి నిరుద్యోగురాలిగా ఉన్నానని, కుటుంబ పోషణ భారం అవుతుందని, తనకు ఆర్ధిక భరోసా కోసం ఉపాధి కల్పించాలని నాడు రేవంత్‌ను కలిసి విన్నవించుకుంది రజినీ.

ఆమె బాధను తెలుసుకున్న రేవంత్..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని నాడు దివ్యాంగురాలు రజినీకి మాట ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే.. దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగ హామీ పత్రం అందజేశారు. నాడు నేను మాట ఇస్తున్నా అన్నాడు.. నేడు అమలు చేసి చూపించాడు రేవంత్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నిజమైన ప్రజానాయకుడిగా నిలిచాడు.

ప్రమాణస్వీకారానికి వచ్చిన వేలాది మంది ప్రజా సమక్షంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సిక్స్ గ్యారెంటీస్ తో పాటు.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని మరోసారి గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం సాధ్యం కాలేదని, అది తమతోనే సాధ్యం అవుతుందన్నారు. అన్ని ప్రాంతాలు, కులాలు, వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు రేవంత్.

గడీల పాలనను బద్ధలు కొడతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు అన్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ కంచెలను తొలగిస్తామని, సామాన్య ప్రజలకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం కల్పిస్తామని, ప్రజా దర్భార్‌ను నిర్వహిస్తామని గతంలో చెప్పిన రేవంత్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చిన రేవంత్.. ప్రగతి భవన్ ముందున్న కంచెలను తొలగించారు. తమది ప్రజా ప్రభుత్వం అని భరోసా కల్పించేందుకు తొలి అడుగు వేశారు. అలాగే రేపటి నుంచే ప్రగతి భవన్‌లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తామని.. సభా వేదికగానే ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ నెరవేరుస్తుందనే ధీమాను ప్రజల్లో కల్పించేందుకు.. తొలి రోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్.

తెలంగాణ ప్రజల ఆంక్షాల దిశగానే కాంగ్రెస్ పాలన ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. సంక్షేమ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామన్నారు. ప్రజలే పాలకులని, ప్రజా భాగస్వామ్యంతోనే ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

Tags:    

Similar News