చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ: అజెండాలోని 4 ముఖ్యాంశాలివే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 6 శనివారం హైద్రాబాద్ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సమావేశం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 6 శనివారం హైద్రాబాద్ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సమావేశం అవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు.
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు, కేసీఆర్ లు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. 2019-2024 లో కేసీఆర్, జగన్ విభజన అంశాలు, నీటి వాటాలపై విడతల వారీగా చర్చించారు. తాజాగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఆంధ్రప్రదేశ్ పోర్టుల్లో వాటా కోరనున్న తెలంగాణ
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. దీనిలో వాటాను తెలంగాణ కోరే అవకాశం ఉంది. టీటీడీ ఆదాయంలో కూడా తమకు కొంత వాటాను ఇవ్వాలని తెలంగాణ అడుగుతారని సమాచారం. మరో వైపు మచిలీపట్టణం, కృష్ణపట్టణం, గన్నవరం పోర్టుల్లో కొంత భాగం కేటాయించాలని తెలంగాణ కోరుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. అయితే ఏపీలో విలీనమైన మండలాలను తిరిగి తమకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం ఇవాళ్టి సమావేశంలో ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతంలో పోర్టులు, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు చేసిన వ్యయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని కోరడంలో తప్పు లేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. సింగరేణిలో ఆంధ్రప్రదేశ్ వాటా అడిగితే ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల్లో వాటాతో పాటు టీటీడీ రెవిన్యూలో కూడా వాటా ఇవ్వాలనే డిమాండ్ ను తెలంగాణ తెరమీదికి తెచ్చే అవకాశం ఉంది.
ఇంకా పూర్తికాని ప్రభుత్వ సంస్థల విభజన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటినా కూడా 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఈ రెండు సంస్థల విభజన కోసం అప్పట్లో షిలా భిడే కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు సిఫారసులు చేసింది. 9వ షెడ్యూల్ లో ఉన్న 68 సంస్థల విభజనకు తెలంగాణ అంగీకారం తెలిపింది. మరో 23 సంస్థల విభజనకు అభ్యంతరం తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన సంస్థల విభజన పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ రెండు రాష్ట్రాలకు సూచించింది. షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల ఆస్తులను ఎక్కడివి అక్కడే ఉంచి ఉద్యోగుల విభజన చేయాలని కేంద్రం సూచించింది.
10వ షెడ్యూల్ లో 142 సంస్థలున్నాయి. వీటిలో 122 సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. మిగిలినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. షెడ్యూల్ 10 సంస్థల ఆస్తుల విభజన చట్టంలో లేదు. దీంతో ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. దీంతో 10వ షెడ్యూల్ సంస్థల విభజన ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ సంస్థలు తెలంగాణలోనే ఉన్నందున తమకే ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఉమ్మడి నిర్వహణకు తెలంగాణ అంగీకరించడం లేదు.
నీటి వాటాలపై స్పష్టత వచ్చేనా?
కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాల్లో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు సరిగా లేకపోవడంతో ఈ నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు నీరు రావడం లేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా నది నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు, మిగిలిన 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. తమకు 700 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది.
కృష్ణా జలాల పున:పంపిణీ చేయాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే ఈ విషయమై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ హామీ ఇవ్వడంతో సుప్రీంలో పిటిషన్ ను వెనక్కి తీసుకుంది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. మరో వైపు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి తాము ఒప్పుకోలేదని కూడా తెలంగాణ స్పష్టం చేసింది.
మరో వైపు గోదావరి నదిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాలు ఈ నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. తమ రాష్ట్రాల కేటాయింపుల కంటే రెండు రాష్ట్రాలు గోదావరి నీటిని ఎక్కువగానే వాడుకుంటున్నాయి. ప్రతి ఏటా గోదావరి నుండి రెండు నుండి మూడు వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకొనేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని రైతు సంఘాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి.
విద్యుత్ బకాయిలపై రెండు రాష్ట్రాల వాదనలు
విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రానికి రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. కోర్టులను ఆశ్రయించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 6,995 కోట్లను తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల్లో చెల్లించాలని 2022 ఆగస్టు 29న కేంద్రం ఆదేశించింది. విద్యుత్ బకాయిలు రూ. 3,441.78 కోట్లు, బకాయిలకు సర్ చార్జీని కలిపితే రూ.6,995 కోట్లకు చేరిందని కేంద్రం అప్పట్లో తెలిపింది. అయితే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమకు రూ. 17 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. ఈ బకాయిలను చెల్లించాలని అప్పట్లో తెలంగాణ అసెంబ్లీలోనే కేసీఆర్ ప్రకటించారు.
ఈ అంశాలే కాకుండా ఆస్తులు, అప్పుల అంశంతో పాటు సంస్థల విభజనకు సంబంధించి కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలుంటాయనే ఆశాభావాన్ని రెండు రాష్ట్రాల అధికారులు వ్యక్తం చేస్తున్నారు.