Kavitha Released from jail: జైలు నుండి కవిత బయటికొస్తున్న దృశ్యాలు.. ఫస్ట్ వీడియో
BRS MLC Kavitha released from Tihar Jail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై బయటికొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు రౌస్ అవెన్యూ కోర్టుకి అందాయి. కవితను తీహార్ జైలు నుండి రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఈ కేసును విచారిస్తోన్న ట్రయల్ కోర్టు, జైలు ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా రిలీజ్ ఆర్డర్ కాపీని పంపించింది. కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలు అధికారులు కవితను జైలు నుండి రిలీజ్ చేశారు.
ఈ ఏడాది మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుండి కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఏప్రిల్ 11న కవితను సీబీఐ తీహార్ జైలు నుండి అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ.. ఇలా రెండు దర్యాప్తు సంస్థల నుండి విచారణ ఎదుర్కుంటూ జైలు జీవితం గడుపుతూ వచ్చిన కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం ఎంతో ఊరటనిచ్చింది.
కవితకు బెయిల్ మంజూరుపై బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కవిత బెయిల్‌పై కేటీఆర్ స్పందిస్తూ... ఇంతకాలం కవితను అక్రమంగా జైల్లో ఉంచారని ఆరోపించారు. ఆలస్యం అయినా న్యాయమే గెలిచింది అంటూ ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తంచేశారు.
కవితకు బెయిల్ అంశంపై బీజేపి నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవితకు బెయిల్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పారు. ఇది ఆ రెండు పార్టీలకు విజయం లాంటిది అని ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ కోసం గతంలో ఆమె తరుపున కేసు వాదించిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీని ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టగా.. సింఘ్వీపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రయత్నం చేయలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం ఉందనడానికి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి అని బండి సంజయ్ ముందు నుండి ఆరోపిస్తూ వస్తున్నారు.
ఓవైపు కవితకు బెయిల్ కాంగ్రెస్ పార్టీకి కూడా విజయం లాంటిదేనని బీజేపి ఆరోపిస్తుండగా... మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపిపై అలాంటి ఆరోపణలనే చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఎప్పుడూ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లు వేర్వేరు అన్నట్లుగా నటించినప్పటికీ.. ఇప్పుడు వారి అసలు రంగు బయటపడిందని రామ్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాదు... కవితకు బెయిల్ విషయంలో ఇలా జరుగుతుంది అని తమ పార్టీ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి ముందే చెబుతూ వస్తున్నారు కదా అని గుర్తుచేశారు.