BRS MLC Kavitha's Health Condition: కవితకు అస్వస్థత.. ఎయిమ్స్ ఆస్పత్రికి తరలింపు

Update: 2024-08-22 07:15 GMT

BRS MLC Kavitha's Health Condition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే కవితను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కవిత వైరల్ ఫీవర్‌తోపాటు గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కవిత అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఆమె కుటుంబసభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.

సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుండి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే.. ఆగస్టు 20 నాడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, కవిత బెయిల్ పిటిషన్ లో సీబీఐ, ఈడీ ప్రతివాదులుగా ఉన్నారు. ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించాల్సిందిగా కోరుతూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈడీ నుండి కోర్టుకు ఇంకా అఫిడవిట్ అందలేదు.

ఈ నేపథ్యంలో ప్రతివాదుల వాదన వినకుండా బెయిల్ మంజూరు చేయలేమంటూ సుప్రీం కోర్టు కవిత బెయిల్ పిటిషన్ విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఆగస్టు 22వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఈడికి సూచించింది. ఈ క్రమంలోనే కవిత్ బెయిల్ పిటిషన్ తదుపరి విచారణకు మరో 5 రోజులు మిగిలి ఉండగానే ఆమె అస్వస్థతకు గురయ్యారు.

రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు 

కవిత ఆరోగ్యం గురించి అక్కడి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, హరీష్ రావు.. రేపు ఢిల్లీకి వెళ్లి కవితను పరామర్శించనున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ 100 శాతం అమలు చేయాలనే డిమాండ్‌తో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. కేటీఆర్ చేవెళ్లలో, హరీష్ రావు మరో చోట ధర్నాలో పాల్గొన్నారు. అందుకే ఇవాళ కాకుండా రేపు వాళ్లు ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ షెడ్యూల్ చేసుకున్నారు.

Tags:    

Similar News