BJP: స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి సిద్ధమైన కమలదళం
BJP: కర్ణాటకలో ఫెయిల్యూర్ బ్యాచ్‌గా ముద్ర వేసుకున్న స్టార్ క్యాంపెయినర్లు..
BJP: స్టార్ క్యాంపెయినర్లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది కమలదళం. ఎంపిక చేసిన 40మంది తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. జాతీయ నేతలతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యడ్యూరప్ప, స్మృతి ఇరానీ తదితరులు తెలంగాణకు క్యూ కట్టబోతున్నారు. ఐతే స్టార్ క్యాంపెయినర్ లిస్టుపై ఇక్కడి బీజేపీ అభ‌్యర్థులు సంతృప్తిగా ఉన్నారా..? అగ్రనేతల రాకతో తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారా..? లేక తమకు ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఫెయిల్యూర్ బ్యాచ్‌గా ముద్ర వేసుకున్న ఈ స్టార్ క్యాంపెయినర్లు.. కనీసం తెలంగాణలో అయినా ప్రభావం చూపుతారా అనే ఆసక్తి నెలకొంది.
కిషన్‌రెడ్డి, ఈటల, రాజాసింగ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, అర్వింద్, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మినహా కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే బ్యాచ్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. జాతీయ అగ్రనేతలు సైతం కర్ణాటకలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఐనా అక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించి హస్తానికి జై కొట్టారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే బ్యాచ్ ప్రచారానికి రాబోతుండటంతో కమలానికి సానుకూల ఫలితం ఉంటుందా..? లేక కర్నాటక లాగే ఓటమిని ముటగట్టుకుంటారా..? కర్నాటకలో ఫెయిల్యూర్ బ్యాచ్‌గా ముద్ర పడిన వీరిని.. తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీజేపీ వెనకబడిందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తుంటే.. కషాయదళం మాత్రం ఇవాళ్టి మోదీ సభతో ప్రచారా శంఖారావాన్ని పూరించబోతోంది. మొన్నటి వరకు గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కమలం.. ఉన్నట్టుండి సెకండ్ స్థానం నుంచి థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. దీంతో మోదీ, అమిత్ షా లాంటి స్టార్ క్యాంపెయినర్లతో అయినా పార్టీలో, కార్యకర్తల్లో జోష్ వస్తుందా అని అభ్యర్థులు చూస్తున్నారు.