Apsara Murder Case: అప్సర హత్యకేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..
Apsara Murder Case: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అప్సర మర్డర్ సంచలనం సృష్టించింది.
Apsara Murder Case: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అప్సర మర్డర్ సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకోమని వెంటబడినందుకే అప్సరను నిందితుడు సాయికృష్ణ పక్కా ప్లాన్‌తో మర్డర్ చేశారని పోలీసులు తేల్చారు. పెళ్లైన సాయికృష్ణకు, అప్సరకు రిలేషన్ ఉందని పోలీసులు గుర్తించారు. ఎలాగైనా యువతిని వదిలించుకోవాలనే హత్యకు ప్లాన్ చేశాడని తెలిపారు.
చెన్నైకి చెందిన అప్సర.. హైదరాబాద్‌కు వచ్చి సెటిలైంది. సాయికృష్ణ స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం. ఓ గుడిలో పూజారిగా చేస్తున్న సాయికృష్ణకు 2010లోనే వివాహమైంది. సాయికృష్ణకు ఒక పాప కూడా ఉందని పోలీసులు తెలిపారు. అప్సర ఓసారి సాయికృష్ణ పూజారిగా పనిచేస్తున్న ఆలయానికి వచ్చింది. ఆమెతో పరిచయం పెంచుకున్న సాయికృష్ణ... సినిమా అవకాశాల పేరిట ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు.
సాయికృష్ణకు పెళ్లయిందని తెలిసినా, తనను వివాహం చేసుకోవాల్సిందేనని అప్సర ఒత్తిడి చేసింది. అప్సర వైఖరితో ఆందోళన చెందిన సాయికృష్ణ ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. కోయంబత్తూరు వెళ్దామని అప్సరను కారులో తీసుకెళ్లాడు. మే 3వ తేదీ రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి ఇద్దరూ కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అదే రోజు రాత్రి 11 గంటలకు శంషాబాద్ సమీపంలో అప్సర కారు ముందు సీట్‌లోకి వచ్చి కూర్చుందన్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.50కి సుల్తాన్ పూర్ గోశాల వద్ద అప్సరను చంపేందుకు సాయికృష్ణ పక్కా ప్లాన్ వేశాడని తెలిపారు. కారు బాడీ కవర్‌తో ఊపిరి ఆడకుండా చేసి చంపాలని స్కెచ్ వేశాడని.. అయితే అప్సర మేల్కొని ప్రతిఘటించడంతో బెల్లం కొట్టే రాయితో తలపై పది సార్లు కొట్టి హత్య చేశాడని డీసీపీ వెల్లడించారు. అనంతరం డెడ్‌బాడీని సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో పడేశాడన్నారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా నమ్మించేందుకు ప్రయత్నించాడని.. చివరికి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు ఛేదించామన్నారు.
అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేసును ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ నుంచి..శంషాబాద్ రూరల్ పీఎస్ కు బదిలీ చేశారు. కాసేపట్లో అప్సర డెడ్ బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే కుటుంబ సభ్యుల సంతకం కోసం వైద్యులు వేచి చూస్తున్నారు. నేడు కాశీ నుండి అప్సర తండ్రి రానున్నట్టు సమాచారం. కుటుంబీకుల సంతకం తర్వాతే పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించనున్నారు.