By-Elections: హుజూరాబాద్ షెడ్యూల్‌తో పార్టీలు అలర్ట్
By-Elections: ప్రచారం జోరు పెంచేందుకు సన్నాహాలు
By-Elections: ఎట్టకేలకు పార్టీల ఎదురుచూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడింది. ఇక.. అలర్ట్ అయిన పార్టీలు.. ప్రచారం జోరు పెంచనున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా.. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం కాస్త వెనుకబడింది. హుజురాబాద్ బైపోల్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్, 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ గెల్లు శ్రీనివాస్‌ను క్యాండిడేట్‌గా ప్రకటించింది. ఓ రౌండ్ ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేసింది. మరోపక్క ట్రబుల్ షూటర్ హరీష్‌రావు హుజూరాబాద్ ఉప ఎన్నిక రంగంలోకి దిగి టీఆర్‌ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు.
ఇక టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ సైతం ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మాటల దాడితో ప్రచారానికి పదును పెంచారు. సభలు, సమావేశాలతో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి తన సత్తా చాటాలన్న కసితో పనిచేస్తున్నారు. మరోవైపు.. ఆయన భార్య జమున కూడా ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించి.. ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. తాజాగా షెడ్యూల్ రావడంతో ఇక అభ్యర్థి ఖరారుపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒకటి, రెండుసార్లు అభ్యర్థి ఎంపిక కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ముగ్గురు పేర్లను సూచిస్తూ పీసీసీకి, ఏఐసీసీకి నివేదిక అందజేసింది టీ కాంగ్రెస్. ఈ కమిటీ రిపోర్టులో కొండా సురేఖ, మాజీ ఎంపీపీ సదానందం, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డిల పేర్లు పేర్కొన్నారు. అయితే.. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారనేది సస్పెన్స్ గా మారింది.