మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. మహరాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి సోమవారం బెజ్జూర్ మండలం పెద్దసిద్ధాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్‌కు తారసపడింది. సిద్దాపూర్ నుంచి పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని గుండెపల్లి గ్రామానికి పనుల నిమిత్తం వెళ్లి తిరిగి సాయి కుమార్ ద్వి చక్ర వాహనంపై వస్తున్నాడు. పాపన్నపేట వైపు నుంచి బెజ్జూర్ బీట్ వైపు పులి రోడ్డుపై నుంచి రావడాన్ని సాయి గమనించాడు. వెంటనే ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై వదిలేసి చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకున్నాడు.
రెండు రోజుల క్రితం సిద్దాపూర్ మార్తిడి గ్రామానికి చెందిన రైతులకు బీట్ పరిధిలోని గొల్లభాయ్ చెరువు సమీపంలో పులి కనిపించింది. ఇటీవల బెజ్జూర్ రేంజ్ పరిధిలోని భీమన్న అటవీ సమీపంలో అధికారులు పులిని బంధించేందుకు మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, వరంగల్ నుంచి వైద్యు లతో పాటు షూటర్లను తెప్పించి ఆరు రోజులు పాటు ఆపరేషన్ కొనసాగించారు. అప్పటి నుంచి పులి కానరాలేదు. మళ్లీ సోమవారం పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మూడు నెలల పాటు ముప్పు తిప్పలు పెడుతున్న మహారాష్ట్ర పులి ఇదేనా లేక వేరే పులినా అనే కోణంలో అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.