నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క

Update: 2020-09-30 09:01 GMT
నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క
  • whatsapp icon

మొయినాబాద్‌ మండలం హిమాయత్‌సాగర్‌లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సీతక్క అన్నారు. బాలిక సోదరి రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ గ్రీన్‌ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు.

నిందితుడు టీఆర్‌ఎస్‌ నేత కావడంతో అతడిని రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నిందితుడు టీఆర్‌ఎస్‌ నేత కావడంతో మజ్లిస్‌ మిన్నకుండిపోయిందని విమర్శించారు.

Tags:    

Similar News