Telangana Maldives: చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్..
Telangana Maldives: ఓ పక్క కనువిందు చేసే కొండల శ్రేణి...మధ్యలో నీళ్లు... నీళ్లలో బస...ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.
Laknavaram Lake: ఓ పక్క కనువిందు చేసే కొండల శ్రేణి...మధ్యలో నీళ్లు... నీళ్లలో బస...ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఆ ఊహను నిజం చేసేలా.. పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం ముస్తాబైంది. ఇప్పటికి సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను తెలంగాణ మాల్దీవులుగా అలలాడిస్తోంది. ఇది పర్యాటక ప్రాంతానికి ఇది మరో కలికితురాయి కానుంది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపాన్ని మాల్దీవుల్లా, టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు.
పకృతి అందాలను ఆరబోస్తున్న ఈ ఐలాండ్‌లో మొత్తం 22 కాటేజీలున్నాయి. అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. స్విమ్మింగ్ పూల్ నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఈతకొలనులో ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెండు స్టాలు, రెస్టారెంటు తదితర వసతులు కల్పించారు.
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, సిమ్లా మున్నార్ తదితర ప్రాంతాలను తలపించేలా ఈ ద్వీపాన్ని సుందరీకరించారు. ఈ అందాలను తీర్చిదిద్దడానికి ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమారు 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చినట్లు పర్యాట కేంద్ర అధికారులు చెబుతున్నారు. మాల్దీవుల మాదిరిగానే ఉండడంతో హైదరాబాద్, నల్గొండ, వరంగల్ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో మాల్దీవుల్లో పర్యటించిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు పర్యాటకులు.